
ముంబై: డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌పై ఆ జట్టు టాలెంట్ స్కౌట్ (ప్రతిభాన్వేషకుడు) మెంబర్ పార్థివ్ పటేల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో ముంబై టైటిల్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈసారి కూడా ముంబై విజేతగా నిలిచి ఐపీఎల్‌లో తొలిసారి హ్యాట్రిక్ టైటిల్ సాధించిన జట్టుగా ముంబై రికార్డు సృష్టించాలని కోరుకుంటున్నాడు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తోన్న యువ ఆటగాళ్లను గుర్తించడం కోసం ముంబై కోచింగ్ స్టాఫ్, స్కౌట్స్ గ్రూప్‌తో కలిసి పార్థివ్ పని చేసున్న విషయం తెలిసిందే.
తాజాగా ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ మాట్లాడుతూ... 'ఐపీఎల్ అంటేనే ఎంటర్‌టైన్మెంట్. ఆటగాళ్లంతా తమ ప్రతిభని నిరూపించుకొనే ఓ చక్కటి వేదిక. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్‌తో పాటు ఎంతోమంది ఆటగాళ్లు ఎలా ఆడారో దగ్గరుండి చూశాను. అయితే ఐపీఎల్‌లో ఇప్పటివరకూ నమోదు కాని ఓ గొప్ప రికార్డును చూడాలనుకుంటున్నా. అదేంటంటే.. ఏదైనా జట్టు ఫైనల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించడం. ఈసారి ముంబైకి ఆ అవకాశం ఉంది. అది చూడాలనుకుంటున్నా' అని అన్నాడు.
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రాంచైజీ కూడా ఫైనల్లో హ్యాట్రిక్ విజయాలు సాధించలేదు. చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011 సీజన్లలో వరుసగా రెండేళ్లు టైటిల్ సాధించింది. 2012లో చెన్నై మూడోసారి ఫైనల్‌కు చేరినా.. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు ముంబై ఇండియన్స్ గత రెండు సీజన్లలో (2019, 2020) విజయం సాధించింది. ఇప్పుడు హ్యాట్రిక్ విజయాలు అందుకునే ఛాన్స్ రోహిత్ సేనకు ఉంది. ఒకవేళ ముంబై ఈసారి టైటిల్ విజేతగా నిలిస్తే.. పార్థివ్ పటేల్ కోరిక నెరవేరినట్లే. మరి ఏం జరుగుతుందో చూద్దాం.
గత సీజన్లో పార్థీవ్ పటేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో భాగమైనప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. 2015, 2017 సీజన్లలో ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో పార్థీవ్ సభ్యుడు. పార్థివ్ ముంబై తరఫున మూడేళ్లు ఆడాడు. ఓపెనర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్‌గా జట్టుకు సేవలందించాడు. సుదీర్ఘకాలం రంజీ క్రికెట్ ఆడిన పార్థీవ్‌కు దేశవాళీ క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్ల గురించి బాగా తెలుసు. ఆ ఉద్దేశంతోనే ముంబై స్కౌట్స్ గ్రూప్‌లో చేర్చుకుంది. పార్థివ్ భారత జట్టు తరఫున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడాడు.