IPL 2021:ముసలోడినైపోయా అన్నాడు..46 బంతుల్లోనే సెంచరీ బాదాడు!10 సిక్సులతో ఆర్‌సీబీ ప్లేయర్ వీరంగం(వీడియో)

హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్.. ఒక రోజు క్రితమే తనని తాను ముసలోడుగా సంబోధించుకున్నాడు. తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచుల కోసం యూఏఈలో ప్రాక్టీస్ మొదలుపెట్టిన మిస్టర్ 360 తన ఆట గురించి మాట్లాడుతూ అలా పేర్కొన్నాడు. అయితే ఒకరోజు తర్వాత యువ కుర్రాడి మాదిరిగా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్సుల వర్షం కురిపిస్తూ.. కేవలం 46 బంతుల్లోనే 104 రన్స్ చేశాడు. మిస్టర్ 360 తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 సిక్సులు బాదాడు.

ఆర్‌సీబీ ముమ్మర సాధన:
ఐపీఎల్ 2021 రెండో దశకు సమయం దగ్గరపడుతోంది. యూఏఈలో మరో నాలుగు రోజుల్లో క్యాష్ రిష్ లీగ్ ఆరంభం కానుంది. ఐపీఎల్ కోసం ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు యూఏఈ చేరుకొని ప్రాక్టీస్ మొదలెట్టగా.. ఇంగ్లండ్ సిరీసులో పాల్గొన్న భారత ప్లేయర్స్ అందరూ ఆదివారం దుబాయ్ చేరుకుని క్వారంటైన్ అయ్యారు. సెప్టెంబరు 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇక సెప్టెంబర్ 20న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇందుకోసం ఆర్‌సీబీ ముమ్మర సాధన చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ మ్యాచులు ఆడుతోంది కోహ్లీసేన.

డివిలియర్స్ శతకం:
మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్స్ రెండు జట్లుగా విడిపోయి ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఒక జట్టుకు దేవదత్ పడిక్కల్, మరో జట్టుకు హర్షల్ పటేల్ సారథులుగా వ్యవహరించారు. టాస్ గెలిచిన హర్షల్ పటేల్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఏబీ డివిలియర్స్ కేవలం 46 బంతుల్లో 7 బౌండరీలు, 10 సిక్సర్ల సహాయంతో 104 పరుగులు చేశాడు. ఏబీ 226 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. 19 బంతుల్లో 19 రన్స్ చేసిన ఏబీ.. 27 బంతుల్లో 81 రన్స్ చేశాడు. ఏబీతో పాటు మహమ్మద్ అజారుద్దీన్ కూడా అర్ధ శతకం సాధించాడు. అజారుద్దీన్ 43 బంతుల్లో 6 సిక్సులు, మూడు ఫోర్లతో 66 పరుగులు చేశాడు. హర్షల్ టీమ్ 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది.

విరుచుకుపడిన కెఎస్ భరత్:
భారీ లక్ష్య ఛేదనలో దేవదత్ పడిక్కల్ ఎలెవన్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు కెఎస్ భరత్ మరియు దేవదత్ పడిక్కల్ తమ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 47 బంతుల్లో 95 పరుగులు చేసిన భరత్.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. భరత్ 11 బౌండరీలు, నాలుగు సిక్సులు బాదాడు. పడిక్కల్ 21 బంతుల్లో 36 పరుగులు చేశాడు. దాంతో పడిక్కల్ ఎలెవన్ చివరి బంతికి విజయాన్ని అందుకుంది. దాంతో ఏబీ డివిలియర్స్ సెంచరీ వృధా అయింది. ఫేజ్ 2లో ఆర్‌సీబీ ప్లేయర్స్ తమ ఫామ్‌ని కొనసాగించాలని మేనేజ్మెంట్ కోరుకుంటుంది.

విశ్రాంతి అవసరం:
తాజాగా తన బ్యాటింగ్ ప్రాక్టీస్ గురించి ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ... 'ఐపీఎల్ 2021 తిరిగి ఆరంభం అవ్వడం చాలా బాగుంది. ఐపీఎల్ కోసం చాలా సన్నద్ధమవుతున్నా. ఇక్కడి వికెట్ కఠినంగా ఉంటుంది. బౌలర్లు బాగా బంతులు వేస్తున్నారు. ఇక్కడ చాలా తేమ ఉంది. మేము చెమటలు కక్కుతున్నాం. ఎందుకంటే తేమ కొంత బరువును తగ్గిస్తుంది. అయితే నాలాంటి వృద్ధులకు వీలైనంత విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆటలో పోటీపడేందుకు నిత్యనూతనంగా ఉండాలి. కుర్రాళ్లు బాగా ఆడుతున్నారు. వారితో పోటీపడేందుకు ఎప్పుడూ తాజాగా ఉండాలి. అందుకోసం శ్రమిస్తున్నా' అని అన్నాడు.

ప్రథమార్ధంలో ఆకట్టుకున్న మిస్టర్ 360:
37 ఏళ్ల ఏబీ డివిలియర్స్ ఆర్‌సీబీ ప్రధాన ఆటగాళ్లలో ఒకడు. ఆర్‌సీబీ టైటిల్ కరువును తీర్చాలంటే.. డివిలియర్స్ బ్యాట్ జులిపించాల్సి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారతదేశంలో జరిగిన ఐపీఎల్ 2021 ప్రథమార్ధంలో డివిలియర్స్ ప్రదర్శన బాగుంది. రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు బాది ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. యూఏఈ పిచ్‌లపై కూడా ఏబీడీ సందడి చేయాలని ఆర్‌సీబీ ఫాన్స్ కోరుకుంటుంన్నారు. మిస్టర్ 360 దీనికోసం ముమ్మర సాధన చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సెంచరీ చేశాడు. డివిలియర్స్ తాజాగా భారీ షాట్లు ఆడాడు. కొన్ని సిక్సులు మైదానం ఆవల పడ్డాయి. మరి సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే 14వ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌ల్లో ఏబీ ఎలా ఆడతాడో చూడాలి.

ఏడు మ్యాచ్‌లలో 207 పరుగులు:
ఐపీఎల్ 2021 ఆగిపోయేవరకు వరకు ఆర్‌సీబీ ఏడు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచులు గెలిచి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఏబీ డివిలియర్స్ ఈ ఏడు మ్యాచ్‌లలో 51.75 సగటుతో 207 పరుగులు చేశాడు. ఏబీ రెండు అర్ధ సెంచరీలు కూడా బాదాడు. అత్యధిక పరుగులు చేసినవారిలో ఏబీ 12వ స్థానంలో ఉన్నాడు. ఇక కరోనా భయంతో లీగ్ మధ్యలోనే జట్టును వీడిన ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా స్థానంలో ఆర్‌సీబీ.. శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగాను తీసుకుంది. వ్యక్తిగత కారణాలతో సెకండాఫ్ లీగ్‌కు దూరమైన డానియల్ సామ్స్ స్థానంలో శ్రీలంకకే చెందిన దుష్మంత చమీరాతో ఒప్పందం కుదుర్చుకుంది. న్యూజిలాండ్ టీమ్ తరఫున బిజీగా ఉన్న ఫిన్ అలెన్ ప్లేస్‌లో టిమ్ డేవిడ్, గాయంతో దూరమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆకాశ్ దీప్‌లు జట్టులోకి వచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications