
యూఏఈ: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం ప్రారంభం కావాల్సిన చివరి టెస్టు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించిన విషయం తెలిసిందే. టీమిండియాకు అసిస్టెంట్ ఫిజియోగా వ్యవహరిస్తున్న యోగేశ్ పర్మార్ కరోనా బారిన పడటంతో.. ఐదో టెస్ట్ ఆరంభానికి మూడు గంటల ముందు ఈసీబీ, బీసీసీఐ టెస్ట్ మ్యాచును రద్దు చేశాయి. ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు రద్దు అయిన కారణంగా తమ ఆటగాళ్లను యూఏఈ రప్పించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలు కసరత్తులు చేస్తున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచులు జరగనున్నాయి.
ఇంగ్లండ్‌లో ఉన్న ఆటగాళ్ల కోసం మాంచెస్టర్ నుంచి ప్రత్యేక చార్టర్ విమానాలను కొన్ని ప్రాంఛైజీలు ఏర్పాటు చేస్తున్నాయని సమాచారం. ఇందుకోసం ఛార్టెర్ సంస్థలతో ఐపీఎల్ జట్టు యాజమాన్యాలు సంప్రదింపులు జరిపాయని తెలుస్తోంది. అయితే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ యాజమాన్యాలు తమ ఆటుగాళ్ల కోసం చార్టర్ విమానాలను ఏర్పాటు చేయడం లేదు. ఈ మూడు ప్రాంఛైజీలు స్వంత ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నాయని సమాచారం. సాధారణ విమాన టిక్కెట్ల ద్వారా ఈ జట్ల ప్లేయర్స్ యూఏఈ చేరుకోనున్నారని తెలుస్తోంది.
'ఇప్పటికిప్పుడు చార్టర్ ఫ్లైట్ ఏర్పాటు చేసే అవకాశం లేదు. స్వంత ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నాం. సాదారణ విమానాల్లో ఆటగాళ్లకు టిక్కెట్లను బుక్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. రేపటి లోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ప్లేయర్ యూఏఈ చేరుకోగానే మిగిలిన ఆటగాళ్ల మాదిరిగానే ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉంటారు' అని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశి విశ్వనాథన్ ఓ జాతీయ మీడియాకు చెప్పారు. తమ ఆటగాళ్లు రేపు మాంచెస్టర్ నుంచి బయలుదేరే అవకాశం ఉందని పంజాబ్ కింగ్స్ సీఈఓ సతీష్ మీనన్ అన్నారు. ముంబై కూడా టిక్కెట్లు బుక్ చేస్తోంది.
ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్.. చెన్నై సూపర్ కింగ్స్ అటగాళ్లు రవీంద్ర జడేజా, చేతేశ్వర్ పుజారా, శార్దూల్ ఠాకూర్, మోయిన్ అలీ మరియు సామ్ కరన్.. పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, మహ్మద్ షమీ మరియు డేవిడ్ మలన్ ప్రస్తుతం మాంచెస్టర్‌లో ఉన్నారు. శనివారం రాత్రికి ఆటగాళ్లందరూ యూఏఈ చేరుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వెళ్లనున్నారు.
భారత క్రికెటర్లతో ఇంగ్లండ్ ఆటగాళ్లను యూఏఈ రప్పించేందుకు ఇప్పటికే కసరత్తులు మొదలయ్యాయని ఓ ఫ్రాంఛైజీకి చెందిన అధికారులు వెల్లడించారు. బీసీసీఐ నుంచి ఒకసారి అనుమతి వచ్చిన వెంటనే క్రికెటర్ల కోసం చార్టెర్ విమానాలు సిద్ధంగా ఉంచుతామని తెలిపారు. శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయాన్నే కుటుంబాలతో పాటు ప్లేయర్స్ యూఏఈ చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ లోగా ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ వస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2021 రెండో దశ ఆరంభం కానుండగా.. చెన్నై, ముంబై మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.