
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశలో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. అబుదాబి వేదికగా మరికొద్ది సేపట్లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మోర్గాన్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ ఆడుతున్నాడు. అన్మోల్‌ప్రీత్ సింగ్ స్థానంలో రోహిత్ తుది జట్టులోకి వచ్చాడు. అయితే హార్దిక్ పాండ్యా మాత్రం ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదు.
ఐదుసార్లు ఛాంపియన్లు అయిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 2021లో అంచనాలను అందుకోలేదు. మొదటి దశలో ఓటములను ఎదుర్కొంది. ఇక రెండో దశలో ఆడిన మొదటి మ్యాచులోనే చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్రారంభంలో వికెట్లు తీసి చెన్నైని కట్టడి చేసిన ముంబై.. ఆపై పరుగులు సమర్పించుకుంది. ఇక బ్యాటింగ్లో కూడా విఫలమై మూల్యం చెల్లించుకుంది. దాంతో ఈరోజు కోల్‌కతాపై గెలవడం ముంబైకి తప్పనిసరి అయింది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచులో 4 విజయాలు అందుకున్న ముంబై పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో దశలో ఇప్పటికే ఓ విజయాన్ని అందుకుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే.. కోల్‌కతాకు ఈ మ్యాచ్ చాలా కీలకం.
అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం పిచ్ బౌలర్లకు అనుకూలించనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా బౌలర్లు చెలరేగిన విషయం తెలిసిందే. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రాణించాడు. ఈ రోజు కూడా స్పిన్నర్లు రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే పేస్ బౌలర్లకు కూడా మ్యాచ్ ఆరంభంలో పిచ్ సహకరించనుంది. బ్యాట్స్‌మన్ క్రీజులో గడిపితే పరుగులు రానున్నాయి. మ్యాచుకు ఎలాంటి వర్ష సూచన లేదు.
గత సీజన్‌లో రెండు గేమ్‌లలో కేకేఆర్.. ముంబై చేతిలో ఓడిపోయినప్పటికీ అబుదాబిలో మాత్రం వారి రికార్డు చాలా మెరుగ్గానే ఉంది. ఇక్కడ ఆడిన 6 మ్యాచుల్లో కేకేఆర్ 5 గెలించింది. ఈ వేదిక వద్ద ఇతర జట్ల సగటు స్కోర్లు 155గా నమోదయ్యాయి. ముంబై గత సీజన్‌లో సగటున 187 పరుగులు సాధించింది. గత ఐదేళ్లలో ముంబైతో జరిగిన 12 మ్యాచ్‌లలో 1 మాత్రమే గెలిచిన కోల్‌కతా.. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ కంటే గట్టి సవాలును ఎదుర్కోనుంది. హిట్టర్లు ఉన్న కోల్‌కతాకు విజయం సాధించడం సులువే.
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: వెంకటేశ్ అయ్యర్, శుభమన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సౌరభ్ తివారీ, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, ఆడమ్ మిల్నే, రాహుల్ చహర్, జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్.