
చెన్నై: ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లు, సహాయ సిబ్బంది అందరికి తాజా కరోనా పరీక్షల్లో నెగెటివ్ రిసల్ట్ వచ్చింది. దీంతో ముంబై ప్రాంచైజీ ఊపిరిపీల్చుకుంది. కొద్ది గంటల క్రితం ముంబై జట్టు వికెట్ కీపింగ్ కన్సల్టెంట్ కిరణ్ మోరేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన ఫ్రాంఛైజీ మంగళవారం ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసి మరీ అందరికీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లోనే అందరికి నెగెటివ్ వచ్చింది.
ముంబై ఇండియన్స్ టీమ్ ప్రస్తుతం చెన్నైలో ఉంది. ముంబై జట్టు సభ్యులు బస చేస్తున్న హోటల్‌లోనే భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే కూడా ఉండటంతో తొలుత ముంబై యాజమాన్యం ఆందోళన చెందింది. అయితే కరోనా పరీక్షల్లో అందరికీ నెగిటివ్ రావడంతో ఆనందం వ్యక్తం చేసింది. కిరణ్ ముంబై జట్టు వికెట్ కీపింగ్ సలహాదారుగా ఉన్నారు. ఏప్రిల్ 9న జరుగనున్న ఐపీఎల్ 14వ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీకొంటుంది.
బీసీసీఐ రూపొందించిన ఆంక్షలు, నిబంధనలను తాము అత్యంత కఠినంగా అమలు చేస్తున్నామని ముంబై ఇండియన్స్ వెల్లడించింది. మోరేకు ఎలాంటి లక్షణాలు లేవని, అతడు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడని చెప్పింది. తమ వైద్య బృందం మోరే ఆరోగ్యాన్ని నిత్యం పర్యవేక్షిస్తోందని తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో అభిమానులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. .
ప్రస్తుత దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజుకు లక్ష వరకు కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 24 గంటల్లో 40వేలకు పైగా కేసులు వస్తున్నాయి. దీంతో అక్కడ రాత్రివేళ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. వారాంతాల్లో లాక్‌డౌన్ పెట్టారు. వాంఖడే మైదానం సిబ్బందికి కరోనా సోకుతుండటంతో ముంబైలో మ్యాచులు జరగడంపై ఇప్పటికీ అనుమానాలు కలుగుతున్నాయి. అయితే బీసీసీఐ మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ జరుగుందని స్పష్టం చేసింది.