
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడని విషయం తెలిసిందే. అయితే రోహిత్ ఎందుకు ఆడలేదో ఆ జట్టు హెడ్ కోచ్, శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే తెలిపాడు. రోహిత్ శర్మకు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమైన నేపథ్యంలో మ్యాచ్ ఆడలేదని జయవర్ధనే స్పష్టం చేశాడు. క కోల్‌క నైట్ రైడర్స్ జట్టుతో జరిగే మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడని అయన వెల్లడించాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఓటమిపాలైన సంగతి తెలిసిందే. చేనై నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ సేన 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులకే పరిమితమైంది. దీంతో ముంబై 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఆదివారం మ్యాచ్ అనంతరం ముంబై కోచ్ మహేల జయవర్ధనే మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మహేల మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ బాగానే ఉన్నాడు. అతడి బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా బాగుంది. అయితే సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటన నుంచి వచ్చిన అతడకి కొన్ని రోజులు విశ్రాంతి అవసరం. త్వరలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగే మ్యాచ్‌లో రోహిత్ ఆడుతాడు. ఎక్కువ పనిభారం కారణంగానే రోహిత్ శర్మకు రెస్ట్ ఇచ్చాం. అంతేకాని వేరే ఉద్దేశమే లేదు' అని అని తెలిపాడు. చెన్నైతో జరిగిన మ్యాచులో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం బరిలోకి దిగలేదు. ఈ విషయంపై ముంబై కోచ్ స్పందిస్తూ.. హార్దిక్ పాండ్యాకు చిన్న సమస్య ఎదురైందని, ముందు జాగ్రత్తగా అతడికి విశ్రాంతి కల్పించామన్నాడు.
యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (58 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటానికి.. బౌలర్ల సహకారం తోడవడంతో ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరో విజయాన్ని నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచులో చెన్నై 20 పరుగుల తేడాతో ముంబైను చిత్తు చేసింది. ముంబై ఓటమిపై మహేల జయవర్ధనే మాట్లాడుతూ.. చెన్నై జట్టులో రుతురాజ్ లాగా తమ జట్టులో ఎవరైనా బ్యాటింగ్ బాధ్యతలు తీసుకోవాల్సిందన్నాడు. చెన్నై అద్భుతంగా ఆడిందని ప్రశంసించాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చెన్నై పటిష్టంగా ఉందని మహేల చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్ ఎంఎస్ ధోనీ (3), మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా (4), ఆల్‌రౌండర్ మొయిన్ అలీ (0), ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ (0) ఘోరంగా విఫలమవగా.. అంబటి రాయుడు (0) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, ఆడం మిల్నే తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 8 వికెట్లకు 136 పరుగులే చేసింది. సౌరభ్ తివారి (50 నాటౌట్) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. భారత టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ (3), ఇషాన్ కిషన్ (11) నిరాశపరిచాడు. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రేవో 3, దీపక్ చహర్ రెండు వికెట్లు పడగొట్టారు. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన రుతురాజ్ గైక్వాడ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.