
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్.. ఇప్పుడు మాత్రం భారత్‌లోనే జరగనుంది. ఈ ఏడాది సీజన్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. బయోబబుల్ మధ్య చెన్నై చిదంబరం స్టేడియంలో మిగతా ఫ్రాంఛైజీల కన్నా ముందే ట్రైనింగ్ క్యాంప్‌ను ప్రారంభించిన చెన్నై.. వినూత్నంగా ప్రాక్టీస్ చేస్తోంది.
మ్యాచ్‌లో ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఆడాలనే అంశంపై సీఎస్‌కే సారథి ఎంఎస్ ధోనీ ఇప్పటి నుంచే ఆటగాళ్లను సన్నద్ధం చేస్తున్నాడు. స్ట్రైక్ రొటేట్ చేయడం, కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడం, వేగంగా పరుగులు రాబట్టడం, ఆఖరి ఓవర్లలో ఒత్తిడిని అధిగమించి బ్యాటింగ్ చేయడం లాంటి అంశాలపై మహీ పర్యవేక్షణలో చెన్నై జట్టు సాధన చేస్తోందని ఆ జట్టు మేనేజ్‌మెంట్ పేర్కొంది. రెగ్యులర్ ప్రాక్టీస్‌కు భిన్నంగా తమ సాధన సాగుతుందని సీఎస్‌కే యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.
సీఎస్‌కే టాప్ ప్లేయర్లు సురేశ్ రైనా, రవీంద్ర జడేజా ఇంకా జట్టుతో కలవాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020కి దూరంగా ఉన్న రైనా.. ఈనెల 24లోగా క్యాంప్‌లో చేరనున్నాడు. జడేజా ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఈ వారం చివర్లో జడ్డూ కూడా టీమ్‌తో కలవనున్నట్లు చెన్నై టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. చెన్నై తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఇక లీగ్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగూళూరుతో ఢీకొట్టనుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా త్వరలోనే ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభించేందుకు సిద్ధమైంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆటగాళ్లు, సిబ్బంది కోసం ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను ఏర్పాటు చేసింది. కోల్‌కతా ప్రాంచైజీ తమ జట్టు అభిమానుల కోసం క్వారంటైన్ సాంగ్‌ను విడుదల చేసింది. వరుసగా రెండో సీజన్‌లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించడాన్ని అభిమానులు కోల్పోతున్నందున ఫ్యాన్స్‌కు అంకితం చేస్తూ ఈ పాటను రూపొందించారు. 'వీ విల్ మిస్ యూ' అంటూ కేకేఆర్ ట్విటర్లో సాంగ్‌ను రిలీజ్ చేసింది. వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫాస్ట్ బౌలర్ కమలేష్ నాగర్‌కోటి, బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి తదితరులు ఆదివారం నుంచి ప్రారంభమైన క్వారంటైన్‌లో చేరారు.