IPL 2021: గొప్ప నాయకులే అలా చేస్తారు.. ధోనీతో ఆడేందుకు నేనెంతో ఆత్రుతగా ఉన్నా: మొయిన్ అలీ

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ప్రశంసల వర్షం కురిపించాడు. మహీ నాయకత్వం అద్భుతమని, అతడి సారథ్యంలో ఆడేందుకు ప్రతిఒక్క ఆటగాడు ఎదురుచూస్తుంటాడన్నాడు. ధోనీ సారథ్యంలో తమ ఆటతీరు మెరుగుపడుతుందని చాలామంది క్రికెటర్లు భావిస్తారని అలీ తెలిపాడు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. టోర్నీ మొదటి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ ఢీ కొట్టబోతోంది.

గొప్ప నాయకులే అలా చేస్తారు:
తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొయిన్ అలీ మాట్లాడుతూ... ' ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఆడిన కొంతమంది క్రికెటర్లతో నేను మాట్లాడాను. తమ ఆటతీరును మహీ ఎలా మెరుగుపరిచాడో వారు నాకు వివరించారు. కేవలం గొప్ప నాయకులే అలా చేస్తారని నా నమ్మకం. ధోనీ నేతృత్వంలో ఆడాలని ప్రతి ఆటగాడి కోరికల జాబితాలో ఉంటుంది. ఎందుకంటే అతడు అలాంటి ఆత్మవిశ్వాసం, స్పష్టతను ఇస్తాడని అనుకుంటున్నా. అందుకే అతడి వద్ద ఆడేందుకు నేనెంతో ఆత్రుతగా ఉన్నా' అని అన్నాడు.

వారితో కలిసి ఆడేందుకు ఎదురుచూస్తున్నా:
'ఏ జట్టులో అయినా ప్రశాంతంగా ఉండే బలమైన నాయకత్వం, కోచ్‌లు ఉండటం అత్యంత కీలకం. వారు ఒత్తిడిని నిర్మూలిస్తారు. ఆటగాళ్లు నిలకడగా ఆడేందుకు సాయం చేస్తారు. అలాంటి జట్టు యాజమాన్యం మాకున్నందుకు సంతోషంగా ఉంది. పోటీలో గెలిచేందుకే సీఎస్‌కేలో ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడున్న వారితో కలిసి ఆడేందుకు ఎదురుచూస్తున్నా' అని మొయిన్ అలీ తెలిపాడు. గతేడాది అలీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన సంగతి తెలిసిందే. గత ఫిబ్రవరిలో జరిగిన వేలంలో భారీ మొత్తానికి అతడిని సీఎస్‌కే దక్కించుకుంది.

ఇతర జట్లు సీఎస్‌కేకు తేడా అదే:
'ఇతర జట్లు సీఎస్‌కేకు తేడా ఏంటంటే.. ప్రతి విషయంలో ఒక పద్ధతి ఉండటం. ఆటగాళ్లు ఏం చేయాలో స్పష్టత ఉంటుంది. ఈ ఫ్రాంచైజీ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఊరికే భయపడరు' అని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ చెప్పుకొచ్చాడు. ముంబై వేదికగా ఏప్రిల్ 10న జరిగే మ్యాచ్‌లో చెన్నై జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఐపీఎల్ 14వ ఎడిషన్ కోసం చెన్నై బ్యాట్స్‌మన్ ఎప్పటి నుంచో సన్నద్ధమవుతున్నారు. ధోనీ, రైనా, రాయుడు, ఉతప్ప, జడేజా, పుజారాలు సాధన చేస్తున్నారు.

వేలంలో రూ. 17.35 కోట్లు:
గతేడాది పేలవ ఆటతీరుతో చెన్నై సెమీస్ చేరని విషయం తెలిసిందే. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 8 ఓటములను ఎదుర్కొని పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న సీఎస్‌కే 2021 మినీ వేలానికి ముందు ఆరుగురిని రిలీజ్ చేసింది. వారిలో కేదార్ జాదవ్, పియుష్ చావ్లా, మురళి విజయ్, మోను కుమార్, హర్భజన్ సింగ్, షేన్ వాట్సన్ ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న జరిగిన వేలంలో సీఎస్‌కే రూ. 17.35 కోట్లు ఖర్చు చేసింది. సీఎస్‌కే కోనుగోలు చేసిన వారిలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీతో పాటు టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications