
ఒకే ఓవర్లో 21 పరుగులు
సెప్టెంబర్ 26న అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కోల్‌కతా నిర్ధేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి ఛేదించిన చెన్నై.. ఐపీఎల్ 2021లో ఓ అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ మ్యాచులో చెన్నై స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విశ్వరూపం ప్రదర్శించాడు.
12 బంతుల్లో 26 పరుగులు అవసరం అయిన దశలో.. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 19వ ఓవర్లో ఏకంగా 21 పరుగులు పిండుకున్నాడు. చివరి బంతికి చెన్నై వియానికి ఒక పరుగు అవసరం కాగా.. పేసర్ దీపక్ చహర్ పని పూర్తిచేశాడు.

336.84 స్ట్రైక్‌రేట్
2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో లోయరార్డర్‌లో మెరుపులు మెరిపించిన రవీంద్ర జడేజా.. అప్పటి నుంచి బ్యాటింగ్‌లో అదే జోరును కొనసాగిస్తున్నాడు. మధ్యలో గాయాలతో సతమతమైనా.. మళ్లీ గాడినపడ్డాడు. భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్ లీగ్‌లోనూ మెరుపులు మెరిపించిన జడేజా.. సెకండాఫ్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు.
తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్‌తో 32 పరుగులు చేశాడు. గత కొంతకాలంగా జడేజా ఆఖరి ఓవర్‌లో ధాటిగా ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆఖరి ఓవర్‌లో 19 బంతులు ఆడిన జడేజా.. 336.84 స్ట్రైక్‌రేట్‌తో 64 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, ఏడు సిక్స్‌లు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే తాజాగా మైఖేల్ వాన్ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ జడేజాపై ప్రశంసల వర్షం కురిపించాడు.

అసలుసిసలైన టీ20 క్రికెటర్
'రవీంద్ర జడేజా అద్భుతమైన ఆటగాడు. అన్ని విభాగాల్లో రాణిస్తాడు. ఇక ఫీల్డింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన విన్యాసాలతో ఆకట్టుకుంటాడు. ఎడమచేతి వాటంతో స్పిన్ బౌలింగ్ చేయగలడు. పిచ్ అనుకూలిస్తే వికెట్లు తీసి ప్రత్యర్థిని తిప్పలు పెడతాడు. ఇక అతడి బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఎలాంటి పరిస్థితిలోనైనా పరుగులు రాబట్టగలడు. క్రీజులోకి వచ్చిన తొలి బంతి నుంచే ఎదురుదాడి చేయగలడు. జడేజా అసలుసిసలైన టీ20 క్రికెటర్. ఒక మంచి బ్యాటర్‌ను తయారు చేయాలంటే క్రిస్ గేల్ లేదా విరాట్ కోహ్లీని ఆదర్శంగా చూపిస్తారు. కానీ మంచి టీ20 క్రికెటర్‌ను తయారు చేయాలంటే మాత్రం జడేజానే సరైన ఉదాహరణ' అని మైఖేల్ వాన్ అన్నాడు.


Click it and Unblock the Notifications












