
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మరికొద్దిసేపట్లో బిగ్ ఫైట్ జరగనుంది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్, మొదటి సీజన్లో కప్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఇషాన్ కిషన్ స్థానంలో నాథన్ కౌల్టర్-నైల్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో స్టార్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాకు మరోసారి నిరాశే ఎదురైంది.
ఐపీఎల్‌లో ముంబై, రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో చెరో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. మిగిలిన ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఈ రెండు జట్లు తలపడిన సందర్భాల్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. రాజస్థాన్‌పై ముంబై ఇప్పటి వరకూ చేసిన అత్యధిక స్కోరు 212 పరుగులు కాగా.. ముంబైపై రాజస్థాన్ చేసిన అత్యధిక స్కోరు 208. ఢిల్లీ పిచ్ పూర్తిగా బ్యాట్స్‌మన్‌కు అనుకూలం. ఇక్కడ 200 స్కోర్ నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉన్న నేపథ్యంలో అభిమానులకే పండగే.
తుది జట్లు:
ముంబై: రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చహర్, నాథన్ కౌల్టర్-నైల్, జయంత్ యాదవ్.
రాజస్థాన్: జోస్ బట్లర్, యశస్వి జైశ్వాల్, సంజు శాంసన్, శివమ్ దూబె, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, క్రిస్ మోరీస్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రహ్మాన్, జయదేవ్ ఉనద్కత్.