
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ మెగా టోర్నమెంట్‌లో మరో సెంచరీ నమోదైంది. ఓ అన్ క్యాప్డ్ ఆటగాడు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డాషింగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ ఐపీఎల్‌లో తొలి సెంచరీని సాధించాడు. 52 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తన పేరు మీద సరికొత్త రికార్డ్‌ను లిఖించుకున్నాడు. అతి పిన్న వయస్సులో వంద పరుగుల ల్యాండ్ మార్క్‌ను అందుకున్న మూడో క్రికెటర్‌గా నిలిచాడతను. ఈ సీజన్‌లో ఇది రెండో సెంచరీ. రాజస్థాన్ రాయల్స్ కేప్టెన్ సంజు శాంసన్ సెంచరీ బాదాడు.
సాధారణంగా- సెంచరీ అనే ల్యాండ్‌మార్క్‌ను అందుకోవడం ఏ క్రికెటర్‌కైనా డ్రీమ్. అందులోనూ ఐపీఎల్ వంటి ఫార్మట్‌లో సెంచరీ చేయడమంటే మాటలు కాదు. ఓ కొత్త క్రికెటర్ మరింత ఒత్తిడికి లోనవుతుంటాడు. దేవ్‌దత్ పడిక్కల్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. 90 ప్లస్ ఫియర్ అతన్ని కూడా ఆవహించింది. 90 పరుగులు దాటిన తరువాత ఒత్తిడికి లోనైనట్టు కనిపించాడతను. ఆ సమయంలో అతనితో పాటు క్రీజ్‌లో ఉన్న కేప్టెన్ విరాట్ కోహ్లీ.. పడిక్కల్‌ను ముందుండి నడిపించాడు. పడిక్కల్ బంతిని ఎదుర్కొన దలిచిన ప్రతీసారీ.. ధైర్యం చెబుతూ వచ్చాడు.
పడిక్కల్ సెంచరీకి చేరువైనప్పుడు తాను అతనితో మాట్లాడానని కోహ్లీ వెల్లడించాడు. ఐపీఎల్ కేరీర్‌లో తొలి సెంచరీ చేసిన తరువాత.. ఆ అనుభూతి గురించి మాట్లాడుకుందామని ఎంకరేజ్ చేశానని అన్నాడు. ఇలాంటి సెంచరీలు మున్ముందు మరిన్ని చేయాల్సి ఉంటుందని పడిక్కల్ ఆత్మవిశ్వాసంతో సమాధానం ఇచ్చినట్లు తెలిపాడు. తమ జట్టు ఓపెనర్.. సెంచరీ చేయడానికి అర్హుడని, అద్భుతమైన ఇన్నింగ్‌ను నిర్మించాడని చెప్పాడు. ఇలాంటి ఇన్నింగ్ తమ జట్టుకు అత్యవసరమని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 47 బంతుల్లో 72 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు.
ముంబై వాంఖెడే స్టేడియంలో గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్.. మ్యాచ్ మొత్తాన్నీ ఏకపక్షంగా మార్చివేసింది. ప్రత్యర్థి నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఊది అవతల పారేసింది. ఒక్క వికెట్ కూడా బెంగళూరు జట్టు కోల్పోలేదు. ఓపెనర్లే మ్యాచ్‌ను ముగించేశారు. ఈ క్రమంలో దేవ్‌దత్ పడిక్కల్ సెంచరీ సాధించాడు. మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ.. 72 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఏకంగా ఆరుమంది బౌలింగ్ చేసినప్పటికీ.. కోహ్లీ-పడిక్కల్ జంటను విడగొట్టలేకపోయారంటే వారి బ్యాటింగ్ ధాటి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.