
దుబాయ్: భారత్‌లో కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 మ్యాచ్‌లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు (యూఏఈ) బీసీసీఐ తరలించిన విషయం తెలిసిందే. వచ్చే సీజన్ విషయంలో కూడా ఇదే తరహాలో ఆలోచిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఐపీఎల్ 2021 సమయానికి భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి రాకపోతే.. వరుసగా రెండో ఏడాది కూడా అక్కడే నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.
రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను బలోపేతం చేసుకోవడం కోసం బీసీసీఐ, యూఏఈ క్రికెట్ బోర్డు మధ్య ఒక ప్రత్యేక ఎంఓయూ కుదిరింది. దీని ప్రకారం వచ్చే నెలల్లో భారత్‌లో కరోనా ఉధృతి తగ్గకపోతే.. టీమిండియా సొంతగడ్డపై ఆడాల్సిన సిరీస్‌లకు యూఏఈ ప్రత్యామ్నాయ వేదిక అవుతుంది. యూఏఈతో ఒప్పందాల గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విట్టర్లో వెల్లడించాడు. అధికారికంగా ధ్రువీకరించలేదు కానీ భారత్‌లో కరోనా పరిస్థితులు మెరుగుపడకపోతే ఒప్పందం ప్రకారం.. వచ్చే ఆరు నెలల్లో జరగాల్సిన 2021 ఐపీఎల్‌ను కూడా యూఏఈలో నిర్వహించే అవకాశముంది.
మరోవైపు ఈ ఏడాది చివర్లో ఇంగ్లండ్ జట్టుతో టెస్టు సిరీస్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు దీనిని కూడా యూఏఈలోనే జరిపే అవకాశం కనిపిస్తోంది. ప్రతి ఏటా షెడ్యూల్‌లాగే ఏప్రిల్-మేలోనే ఐపీఎల్ జరగాల్సి వస్తే యూఏఈనే సరైన వేదికగా భావిస్తున్నట్లు చెప్పిన బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు... ఇంగ్లండ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు కూడా ప్రత్యామ్నాయంగా ఎడారి దేశాన్ని చూసినట్లు చెప్పారు.
'వచ్చే ఆరు నెలల్లో రెండు పెద్ద ఈవెంట్లు ఉన్నాయి.ఇంగ్లండ్‌తో సిరీస్‌ను ఇప్పటికీ భారత్‌లోనే నిర్వహించాలని అనుకుంటున్నారు. కానీ జనవరిలో కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోతే సిరీస్‌ను యూఏఈలో నిర్వహించాలన్నది బోర్డు ఆలోచన. 2021 ఐపీఎల్ విషయంలోనూ ఇదే ఉద్దేశంతో ఉంది' అని ఓ బీసీసీఐ సీనియర్ అధికారి చెప్పాడు. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ తర్వాత భారత జట్టు యూఏఈలో ఆడేందుకు నిరాకరిస్తూ వచ్చింది. 2006లో మాత్రం పాక్‌తో 2 వన్డేల సిరీస్ ఆడింది. ఇక 2014లో కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు అక్కడ ఆడింది. 2018లో జరిగిన ఆసియా కప్‌లో కూడా భారత్ పాల్గొంది.