
చివరి లీగ్..ఈ సాయంత్రమే
ఈ ఐపీఎల్ లీగ్ దశలో ముంబై ఇండియన్స్ తన చిట్ట చివరి మ్యాచ్‌ను ఆడబోతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ రెండు జట్లకూ ఈ సీజన్‌లో ఇదే చివరి మ్యాచ్ అవుతుంది. ముంబై ఇండియన్స్‌కు కూడా ఇది చివరి మ్యాచ్ అవుతుందనుకోవడంలో సందేహాలు అక్కర్లేదు. ఈ సాయంత్రం 7:30 గంటలకు అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో మ్యాచ్ ఉంటుంది. అదే సమయానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ కేపిటల్స్ మధ్య మరో మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ రెండు జట్లూ ప్లేఆఫ్స్‌లో ఎంట్రీ ఇచ్చాయి.

నెట్ రన్‌రేట్ కీలక పాత్ర..
ప్రస్తుతం ముంబై ఇండియన్స్, కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య ప్లేఆఫ్స్ కోసం హోరాహోరి పోరు నడిచిన విషయం తెలిసిందే. ఈ బిగ్ ఫైట్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ గెలిచింది..ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్ గెలవడంతో తన పాయింట్లను సంఖ్యను 14కు పెంచుకోగలిగింది నైట్ రైడర్స్. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఖాతాలో ఉన్న పాయింట్లు 12. సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిచి.. 14 పాయింట్లను సాధించినా గానీ ప్లేఆఫ్స్‌లో వెళ్లలేదు. పాయింట్లు సమానంగా ఉన్నా.. నెట్ రన్‌రేట్ విషయంలో నైట్ రైడర్స్.. ముంబై కంటే చాలా మెరుగ్గా ఉంది.

టాస్ ఓడితే..
ముంబై ఇండియన్స్ తన నెట్ రన్‌రేట్‌ను మెరుగుపరచుకోవడానికి అందుబాటులో ఉన్న ఏకైక మ్యాచ్‌ను ఆ సాయంత్రం.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ విషయంలో టాస్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముంబై ఇండియన్స్ టాస్ గెలిస్తే- తొలుత బ్యాటింగ్ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. 200లకు పైగా పరుగులు చేయాల్సి ఉంటుంది. తన ప్రత్యర్థిని 171 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉంటుంది. అలా లక్ష్యాన్ని నిర్దేశించాలీ అంటే ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయడం తప్పనిసరి. ఇలా చేయగలిగితేనే నెట్ రన్‌రేట్‌లో నైట్ రైడర్స్‌ను అధిగమించగలుగుతుంది. టాస్ ఓడిపోయి- ఫీల్డింగ్ చేయాల్సి వస్తే.. ఆ ఛాన్స్ కూడా ఉండదు.

అది అసాధ్యం..
ప్రత్యర్థిపై 200లకు పైగా పరుగులు చేయాల్సి రావడం ముంబై ఇండియన్స్ వంటి బలమైన జట్టుకు పెద్దగా అసాధ్యమైన పనేమీ కాదు. ఇదివరకు 200 మార్క్‌ను దాటిన మ్యాచ్‌లు చాలానే ఉన్నాయి. రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, ఇషాన్ కిషన్, కీరన్ పొల్లార్డ్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి బ్యాట్స్‌మెన్లతో నిండివున్న ముంబై ఇండియన్స్‌కు 200లకు పైగా పరుగులు చేయడం కష్టం కాకపోవచ్చు. ఎటొచ్చీ- తన ప్రత్యర్థిని 171 పరుగుల తేడాతో ఓడించాల్సి రావడమే అసలు హర్డిల్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 29 పరుగుల లోపే ఆలౌట్ చేయాల్సి ఉంటుంది. అది అసాధ్యం..

అయిదుసార్లు ఛాంపియన్..
ఐపీఎల్ టోర్నమెంట్‌పై ముంబై ఇండియన్స్ వేసిన బ్రాండ్.. ఏ మాత్రం చెక్కు చెదరనిది. కిందటి సీజన్ వరకూ రోహిత్ సేనదే ఆధిపత్యం. ఇదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలను సాధించింది. ప్లేఆఫ్స్‌లో దర్జాగా అడుగు పెట్టింది. ఆ తరువాత ఒక్క ఓటమిని కూడా చవి చూడలేదు. వరుస విజయాలతో టైటిల్‌ను ఎగరేసుకెళ్లింది. అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది ముంబై. ఇప్పుడు మాత్రం ఆ దూకుడును కొనసాగించలేకపోయింది. ఇప్పటిదాకా ఆడిన 13 మ్యాచుల్లో ఏడింట్లో ఓడిపోయింది. 12 పాయింట్లతో ఆరోస్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications
