
హైదరాబాద్: క్రికెట్ చరిత్రలో 'హెలికాఫ్టర్ షాట్' అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. మెరుపు వేగంతో దూసుకువచ్చే యార్కర్‌ని అంతేవేగంతో తిరిగి బాదడమే ఈ షాట్ ప్రత్యేకత. బ్యాట్‌ను హెలికాఫ్టర్ రెక్కల్లా గుండ్రగా తిప్పుతూ ధోనీ కొట్టే సిక్సులు చాలా ఫేమస్. మహీ ఈ షాట్ కొడితే.. కచ్చితంగా బంతి స్టాండ్స్‌లోకి వెళ్లాల్సిందే. మహీ ప్రవేశపెట్టిన ఈ షాట్‌ను ఎందరో క్రికెటర్లు ఆడేందుకు ప్రయత్నించారు. వీరిలో కొందరు సఫలమైతే.. మరి కొందరికి మాత్రం పరాభవం తప్పలేదు. అయితే భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా అచ్చం ధోనీలాగా హెలికాప్టర్ షాట్లను అలవోకగా బాదాడు.
ఐపీఎల్ 2021 రెండో దశకు సమయం దగ్గరపడుతోంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి క్యాష్ రిచ్ లీగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు అక్కడికి చేరుకుని ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కూడా సాధన మొదలెట్టింది. ముంబై స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. దాంతో మిగిలిన మ్యాచ్‌ల్లో రాణించాలనే పట్టుదలతో ఉన్న హార్దిక్.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ సెషన్‌లో హార్దిక్ అచ్చం ఎంఎస్ ధోనీలా హెలికాప్టర్ షాట్ కొట్టాడు. పాదాల వద్ద యార్కర్ రూపంలో పడిన ఓ బంతిని కళ్లుచెదిరే రీతిలో హెలికాప్టర్ షాట్ ఆడాడు.
హార్దిక్ పాండ్యా కొట్టిన హెలికాప్టర్ షాట్‌కు బంతి మైదానం బయపడింది. దీంతో మైదానంలో ఉన్న ముంబై ఇండియన్స్ కోచింగ్ సిబ్బంది షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని ముంబై తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. జస్ట్ వావ్ అని కాప్షన్ పెట్టింది. వీడియోకు ఇప్పటికే లక్షల్లో లైకులు, కామెంట్లు వచ్చాయి. అంతేకాదు షాట్ ఆడిన పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఓ లుక్కేయండి. ఇక ఈ రోజు టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ.. భారత జట్టును ప్రకటించే అవకాశముంది. ఇందులో తనకు చోటు దక్కుతుందని హార్దిక్ ఆశాభావంతో ఉన్నాడు.
ఎంఎస్ ధోనీ తరహాలో హెలికాప్టర్ షాట్ ఆడాలని చాలా మంది క్రికెటర్లు ప్రయత్నించారు. కానీ ఓ ఐదారురు మాత్రమే ఇప్పటి వరకూ ఆ షాట్‌పై ఫర్‌ఫెక్షన్ సాధించారు. అందులో హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రషీద్ ఖాన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ముందు వరుసలో ఉన్నారు. ముఖ్యంగా పంత్ ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం ఒక్క హెలికాప్టర్ షాట్ అయినా ఆడేందుకు ప్రయత్నిస్తుంటాడు. సక్సెస్ కూడా అవుతుంటాడు. అవగాహన లేకుండా హెలికాప్టర్ షాట్ ఆడితే బ్యాట్స్‌మెన్ ఔటవడమే కాకుండా.. గాయపడే ప్రమాదాలు చాలా ఎక్కువ. అందుకే చాలా మంది క్రికెటర్లు ఆ షాట్ ఆడే సాహసం చేయడం లేదు.
ఎంఎస్ ధోనీ భారత జట్టులోకి వచ్చిన కొత్తలో ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం ఒక హెలికాప్టర్ షాట్ ఆడేవాడు. ఆ తర్వాత కెప్టెన్సీ భారంతో ఆ షాట్‌ని మహీ ఎక్కువగా ఆడలేకపోయాడు. వెన్నునొప్పి గాయం కూడా ఆ షాట్ ఆడకపోవడానికి ఒక కారణం. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన మహీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత ఆటతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. మొదటి దశలో ధోనీ మెరుపులు చూసే అవకాశం అభిమానులకు పెద్దగా రాలేదు. మిగిలిన మ్యాచుల్లో అయినామహీ హెలికాప్టర్ షాట్ ఆడాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.