
13 మ్యాచుల్లో 29 వికెట్లు
ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్ ఇప్పటికే రికార్డు నెలకొల్పాడు. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచులో హర్షల్ మూడు వికెట్లు పడగొట్టి ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పటివరకు హర్షల్ పటేల్ ఐపీఎల్ 2021లో 13 మ్యాచులు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. దాంతో ఇప్పటివరకు టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానానికి పడిపోయాడు. బుమ్రా ఐపీఎల్ 2020 సీజన్లో 15 మ్యాచుల్లో 27 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 2017లో భువీ 14 మ్యాచులలో 26 వికెట్లు తీశాడు.

మూడు వికెట్లు పడగొడితే
ఇక ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అగ్రస్థానంలో ఉన్నాడు. 2013 సీజన్లో బ్రావో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. బెంగళూరు ఎలాగూ ప్లే ఆఫ్స్ చేరింది కాబట్టి మరో రెండు మ్యాచులు ఆడనుంది. దాంతో హర్షల్ పటేల్ మరో మూడు వికెట్లు పడగొడితే.. డ్వేన్ బ్రావోతో కలిసి అగ్రస్థానంలో నిలుస్తాడు. నాలుగో వికెట్ పడగొడితే మాత్రం మరో రికార్డు ఖాతాలో వేసుకుంటాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ అవేశ్ ఖాన్ ఐపీఎల్ 2021లో ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడి 22 వికెట్లు పడగొట్టాడు. అవేశ్ కన్నా హర్షల్ 7 వికెట్లు ఎక్కువ పడగొట్టినా.. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రం అతడి బౌలింగ్‌కి ఫిదా కాలేదు. హర్షల్ కన్నా అవేశే టీమిండియాకు ముందుగా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని గౌతీ అబిప్రాయపడ్డాడు.

హర్షల్ కంటే అవేశ్ బెటర్
తాజాగా ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... 'అవేశ్ ఖాన్ ఇన్నింగ్స్‌లో ఎప్పుడైనా అదే తీవ్రతతో బౌలింగ్ చేయగలడు. కొత్త బంతితో, మధ్య ఓవర్లలో, ఇన్నింగ్స్ చివరలో బౌలింగ్ చేయగలడు. హర్షల్ పటేల్ మాత్రం కొద్దిగా భిన్నం. బ్యాట్స్‌మెన్‌లను బట్టి అతడిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఆవేష్ ఏ పరిస్థితులలో అయినా బౌలింగ్ చేయగలడు. అతను రబాడా మరియు నోర్జ్ వంటి టాప్ క్లాస్ బౌలర్లతో కలిసి పనిచేస్తున్నాడు. వారికంటే అవేశ్ తక్కువేమీ కాదు. అతను 140 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువగా బౌలింగ్ చేయగలడు. నాకు ఇప్పటికీ గుర్తుంది.. షార్జాలో హార్దిక్ పాండ్యాకు వేసిన యార్కర్ అద్భుతం. అతడికి మంచి నైపుణ్యం ఉంది. అందుకే నేను హర్షల్ కంటే అవేశ్ ఖాన్ బెటర్ అని నా అభిప్రాయం' అని పేర్కొన్నాడు.

డివిలియర్స్‌ను ఉపయోగించుకోవడం లేదు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏబీ డివిలియర్స్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. 'బెంగళూరు ఏబీ డివిలియర్స్‌ను ఎప్పటికీ ఓపెనర్‌గా లేదా నంబర్ 3 బ్యాట్స్‌మన్‌గా ఆడించాలి. నా దృష్టిలో అతడు ఆరో స్థానంలో ఆడటంలో అర్థమే లేదు. ఓపెనర్‌గా బరిలోకి దిగి ప్రత్యర్థులపై చెలరేగడమే నేను ఇష్టపడతాను. ఏబీ అద్భుతమైన ఆటగాడు. అందుకే నేను డివిలియర్స్ ఆటను ఎక్కువగా చూడాలనుకుంటున్నా. బెంగళూరు మూడో స్థానంలో డానియెల్ క్రిస్టియన్‌ను ఆడించొద్దు. కానీ వాళ్లు అదే పని చేస్తారు. అతడికి బదులు శ్రీలంక ఆటగాళ్లు దుష్మంత చమీరా, వానిండు హసరంగను ఆడించాలి' అని గౌతీ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
