
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినా.. ధోనీ ఫామ్‌లోనే ఉన్నాడన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కంటే ధోనీ చాలా విషయాల్లో బెటర్ అని పేర్కొన్నాడు. మాజీ చాంపియన్లు చెన్నై, కోల్‌కతా జట్లు దుబాయ్ వేదికగా ఈరోజు రాత్రి జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. చెన్నై, కోల్‌కతా జట్లలో ఐపీఎల్ 2021 విజేత ఎవరో కొద్ది గంటల్లోనే తేలనుంది.
ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకూ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు 27 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 17 మ్యాచ్‌ల్లో చెన్నై విజయం సాధించగా.. 9 మ్యాచ్‌ల్లో కోల్‌కతా గెలుపొందింది. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం రాలేదు. గత ఆరు మ్యాచుల్లో కోల్‌కతాపై చెన్నై ఐదింటిలో గెలిచింది. 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నై ఫైనల్‌కి చేరడం ఇది తొమ్మిదోసారి కాగా.. ఇప్పటికే మూడు సార్లు టైటిల్ గెలిచింది. చెన్నై వరుసగా 2008, 2010, 2011, 2012, 2013, 2015, 2018, 2019లో ఐపీఎల్ ఫైనల్‌కి చేరింది. 2010, 2011, 2018లో టైటిల్ గెలుచుకుంది. అన్నిసార్లు మహీ సారథ్యంలోని చెన్నై ఫైనల్ ఆడింది. మరోవైపు కోల్‌కతా ఫైనల్‌కి చేరడం ఇది మూడో సారికాగా.. రెండు సార్లూ (2012, 2014) టైటిల్ విజేతగా నిలిచింది. గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలోనే కోల్‌కతా టైటిల్స్ గెలుచుకుంది.
తాజాగా ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫోతో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... 'ఈ సమయంలో ఎంఎస్ ధోనీ, ఇయాన్ మోర్గాన్ ఫామ్‌ను పోల్చడం సరైంది కాదు. ఎందుకంటే ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించి ఏడాది పూర్తయింది. మరోవైపు మోర్గాన్ ఇంగ్లండ్ జట్టుకి మ్యాచ్‌లు ఆడుతున్నాడు. కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఎప్పుడూ కూడా ఆపిల్‌లను నారింజతో పోల్చకూడదు. ఏదేమైనా మోర్గాన్ కంటే మెరుగైన ఫామ్‌లో ప్రస్తుతం ధోనీ ఉండటం గమనార్హం' అని అన్నాడు. ఎప్పుడూ మహీపై చురకలు వేసే గౌతీ.. ఇప్పుడు పొగడడం మాత్రం విశేషమనే చెప్పాలి.
'ఐపీఎల్ 2021లో బ్యాటింగ్ పరంగానే కాదు.. కెప్టెన్‌గా కూడా ఇయాన్ మోర్గాన్ కంటే ఎంఎస్ ధోనీ బెటర్‌గా కనిపిస్తున్నాడు. మోర్గాన్ బ్యాట్స్‌మెన్, కెప్టెన్‌గా మాత్రమే ఐపీఎల్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కానీ ధోనీకి వికెట్ కీపర్‌గా మూడో అదనపు బాధ్యత కూడా ఉంది. అయినప్పటికీ ధోనీ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నాడు. అందుకే మోర్గాన్ కంటే మహీ మెరుగైన స్థితిలో ఉన్నాడు' అని కోల్‌కతా మాజీ సారథి గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. రెండు జట్ల మధ్య దుబాయ్ వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకి ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంనుండగా.. టాస్ 7 గంటలకు పడనుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌లోనూ అభిమానులు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడోచ్చు.