PBKS vs CSK: 'సూపర్' జడేజా! కళ్లుచెదిరే రనౌట్..‌ స్టన్నింగ్‌ క్యాచ్!(వీడియోలు)

ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ ర‌వీంద్ర జ‌డేజా.. ఎంత మంచి ఫీల్డ‌ర్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. త‌న ఫీల్డింగ్‌తో అవ‌త‌లి జ‌ట్టుకు ప‌రుగులు రాకుండా ఎన్నోసార్లు నియంత్రించాడు. ఒంటిచేత్తో క్యాచ్‌లు అందుకోవ‌డంతో పాటు ఫీల్డింగ్‌లో త‌న మెరుపు విన్యాసాల‌తో ఆక‌ట్టుకుంటాడు. ఐపీఎల్ 2021లో భాగంగా శుక్రవారం వాంఖడే మైదానంలో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న జడేజా ఒక కళ్లు చెదిరే క్యాచ్‌.. ఒక మెరుపు రనౌట్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో ఎప్పటిలానే అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

మొదట పేసర్ దీపక్ చహర్‌ ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌ ఐదో బంతిని విండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్‌ ఫ్లిక్‌ చేశాడు. అయితే గేల్‌ రన్‌ కోసం సిగ్నల్‌ ఇవ్వడంతో.. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ అప్పటికే క్రీజు దాటి ముందుకు పరిగెత్తాడు. దీంతో గేల్‌ కూడా అవతలివైపుకు వచ్చేశాడు. ఈ దశలో మెరుపు వేగంతో స్పందించిన రవీంద్ర జడేజా.. డైరెక్ట్‌ త్రో విసరడంతో రెప్పపాటులో బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో రాహుల్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. పాయింట్ రేంజ్‌లో ఉన్న జడేజా పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకోవడమే కాకుండా.. నేరుగా వికెట్లకు త్రో విసరడం విశేషం.

కేఎల్ రాహుల్‌ను అద్భుత రనౌట్‌తో పెవిలియన్‌కు చేర్చిన రవీంద్ర జడేజా.. ఆ తర్వాత క్రిస్ గేల్‌ను కూడా ఒక స్టన్నింగ్‌ క్యాచ్‌తో వెనక్కి పంపించాడు. దీపక్‌ చహర్‌ వేసిన 5వ ఓవర్‌ రెండో బంతిని గేల్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశలో ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జడేజా.. పాదరసంలా కదిలి ఒకవైపుగా డైవ్‌ చేస్తూ స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అలా ఇద్దరు కీలక ఆటగాళ్లను ఔట్‌ చేయడంలో జడ్డూ కీలకపాత్ర పోషించాడు. దీనికి సంబంధించిన రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలు చూసిన ఫాన్స్ జడేజాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

పంజాబ్ కింగ్స్‌‌ నిర్దేశించిన 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై నాలుగు వికెట్లు కోల్పోయి 15.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (5) మరోసారి నిరాశపర్చినా.. మరో ఓపెనర్‌ డుప్లెసిస్ ‌(36; 33 బంతుల్లో 3x4, 1x6), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ మొయిన్‌ అలీ (46; 31 బంతుల్లో 7x4, 1x6) జట్టును విజయ పథంలో నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే అలీ అర్ధ శతకానికి చేరువైన వేళ మురుగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆపై సురేశ్‌ రైనా (8), అంబటి రాయుడు (0) ఔట్ అయినా సామ్‌ కరన్‌ (5) మిగతా పని పూర్తిచేశాడు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. దీపక్‌ చహర్‌ (13/4) అద్భుత ప్రదర్శన చేశాడు.

PBKS vs CSK: నిప్పులు చెరిగిన చహర్.. చెలరేగిన అలీ, ఫాఫ్.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, April 16, 2021, 23:24 [IST]
Other articles published on Apr 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X