
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచులు సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దుబాయ్, షార్జా, అబుదాబిలో కఠిన బయో బబుల్ మధ్య ఐపీఎల్ 2021 మ్యాచులు జరగనున్నాయి. సెప్టెంబరు 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్ కోసం ఇప్పటికే అన్ని జట్లూ యూఏఈకి చేరుకున్నాయి. క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ చేస్తూ పకడ్బందీగా సన్నద్ధమవుతున్నాయి.
ఐపీఎల్ 2021 తొలి అర్ధ భాగంలో అదిరిపోయే ప్రదర్శనతో టాప్‌లో నిలిచి ఆకట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ మెగా టోర్నీ కోసం ముమ్మర సాధన చేస్తోంది. క్వారంటైన్ పూర్తిచేసుకున్న ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రాక్టీస్ పూర్తయ్యాక ఢిల్లీ ప్రాంచైజీ రాత్రి ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. అక్కడ ఆటగాళ్లు ఆటలు, పాటలతో సందడి చేశారు. మొదటగా ప్లేయర్స్ అందరూ సైగలతో కూడిన ఓ గేమ్ ఆడారు. ఇందులో శ్రేయాస్ అయ్యర్ బృందం ఓడిపోగా.. అమిత్ మిశ్రా టీం గెలుపొందింది. ఆ తరువాత కొందరు ప్లేయర్స్ అందరూ హిందీ పాటలతో అలరించారు.
బాండింగ్ సెషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ చివరగా డాన్స్ స్టెప్పులు వేశారు. స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కొత్త ఉత్సాహంతో సందడి చేశాడు. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'వాతి కమింగ్' పాటకు స్టెప్పులేస్తూ జట్టులో హుషారెత్తించాడు. జట్టు సిబ్బందితో కలిసి అక్కడి ఆటగాళ్లను ఖుషి చేశాడు. ఇంకా వివిధ ఆటలు, పాటలతో ఆటగాళ్లంతా మైమరచిపోయారు. ఇందుకు పాయింట్లు కూడా వేశారు. ప్లేయర్స్ ఆట, పాటలకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పంచుకొని మరిచిపోలేని రాత్రి అంటూ ఆ ఢిల్లీ క్యాపిటల్స్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.
రిషబ్ పంత్ సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2021 తొలి దశ మ్యాచ్‌లలో వరుస విజయాలు సాదించించింది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. పటిష్ట జట్లను సైతం ఓడించి ఔరా అనిపించింది. తొలిసారి సారథ్య బాధ్యతలు చేపట్టినా.. పంత్ ఆకట్టుకున్నాడు. దీంతో గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చినా.. అతడికి కెప్టెన్సీ ఇవ్వలేదు. అయ్యర్ సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది ఫైనల్స్‌కు చేరిన విషయం తెలిసిందే. డీసీ జట్టు ఐపీఎల్ 2021 సెకెండ్ లెగ్ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 22న సన్‌రైజర్స్‌తో ఆడనుంది.
అయితే ఐపీఎల్ 2021 ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ స్టార్ ఆల్‌రౌండర్, ఇంగ్లండ్ ప్లేయర్ క్రిస్ వోక్స్ ఐపీఎల్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. కరోనా వైరస్ కారణంగానే వోక్స్ తప్పుకుంటున్నట్లు సమాచారం. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో, పంజాబ్ కింగ్స్ హిట్టర్ డేవిడ్ మలన్ కూడా ఐపీఎల్ 2021కు దూరమయ్యారు. ఇక ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ రోజు లేదా ఆదివారం యూఏఈ చేరుకోనున్నాడు.