
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాకు ఇదే ఆఖరి సీజన్ అయ్యే అవకాశం ఉందని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ అభిప్రాయపడ్డాడు. ఎవరైనా పరుగులు చేయకపోతే పక్కకు జరగాల్సిందే అని, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ విషయంలో కూడా ఇదే జరిగిందని ఉదహరించాడు. ఈ సీజన్‌లో రైనా అంతగా రాణించలేదు. తొలి దశలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై హాఫ్ సెంచరీ మినహా.. ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడలేదు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన రైనా 157 పరుగులే చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో సురేష్ రైనాది చాలా కీలక పాత్ర. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే రైనా.. మ్యాచును ఒంటిచేత్తో మలుపు తిప్పగలడు. మొదటి బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ చేసినా పరుగుల వరద పారిస్తాడు. 2019 వరకు రైనా 10 పరుగుల లోపు చేస్తే చెన్నై 42 శాతం మ్యాచ్‌లలో గెలిచింది. 30+ పరుగులు చేస్తే 68 శాతం మ్యాచ్‌లలో.. 50+ పరుగులు చేసినప్పుడు 63 శాతం మ్యాచ్‌లలో చెన్నై గెలిచింది. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న రైనా.. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 ఆడలేదు. చాలా గ్యాప్ తర్వాత ఐపీఎల్ 2021 ఆడుతున్న రైనా.. అభిమానులను పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ క్రీడా ఛానెల్లో ముచ్చటించిన డేల్ స్టెయిన్.. తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
'ఐపీఎల్‌లో సురేష్ రైనాకు ఇదే చివరి సీజన్ అయ్యే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రైనా దిగ్గజ ఆటగాడిగా కొనసాగాడు. అలాంటిది ఇప్పుడు రైనాకు కష్టంగా మారింది. ఎవరైనా పరుగులు చేయకపోతే.. పక్కకు జరగాల్సిందే. ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ విషయంలో కూడా ఇదే జరిగింది. మనం చూశాం. చాలా మంది ఆటగాళ్లకూ ఇలాగే జరుగుతుంది' అని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ పేర్కొన్నాడు. ఇదే విషయంపై స్పందించిన స్టార్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.. సురేష్ రైనాలో ఇంకా కొన్ని సీజన్లు ఆడే శక్తిసామర్థ్యాలున్నాయన్నాడు. అయితే ఇప్పుడతడు ఒక మంచి బ్యాట్స్‌మన్‌లా కనపడట్లేదని పేర్కొన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆడిన 11 మ్యాచుల్లో 9 విజయాలు అందుకుని 18 పాయింట్లతో అగ్రస్థానంలో దూసుకుపోయింది. సురేష్ రైనా ఫామ్‌లో లేకపోయినా మిగతా ఆటగాళ్లు రాణిస్తూ జట్టును విజయపథంలో నడిపిస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావో, అంబటి రాయుడు, దీపక్ చహర్ ఇంటిచేత్తో చెన్నైకి విజయాలు అందిస్తున్నారు. దాంతో రైనా ఆడకున్నా.. జట్టుపై పెద్దగా ప్రభావం పడట్లేదు. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్)తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచులో అయినా రైనా రాణించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.