CSK vs SRH:జోరుమీదున్న చెన్నైతో సన్‌రైజర్స్ ఢీ..ఆ బలహీనత అధిగమిస్తేనే విజయం!విరాట్ ఔట్..తుది జట్లు ఇవే!

ఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన 'సూపర్ ఓవర్' మ్యాచ్‌లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కఠిన పోరుకు సిద్ధమైంది. బుధవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మూడుసార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. ఈ సీజన్‌లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడిన హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇకనైనా వార్నర్ సేన పేలవ ప్రదర్శనను పక్కన పెట్టి విజయాల బాట పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది.
మరోవైపు ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై వరుస విజయాలతో మంచి ఉత్సాహంతో ఉంది. ఆరంభ మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా.. ఆ తర్వాత నాలుగు వరుస విజయాలతో దూసుకుపోతోంది. పటిష్ట చెన్నైని ఓడించాలంటే సన్‌రైజర్స్ కష్టపడాల్సిందే. మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్ల బలాలలు ఓసారి చూద్దాం.

టాప్-3పైనే భారం
ఐపీఎల్ 2021 ఆరంభం నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వేధిస్తోన్న ప్రధాన సమస్య బ్యాటింగ్. ఈ కారణంతోనే గెలవాల్సిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్ ఓడింది. టాప్ ఆర్డర్ బాగున్నా.. మిడిలార్డర్‌లో ఒక్క సరైన బ్యాట్స్‌మన్ లేక ఇబ్బందులు పడుతోంది. ఎప్పటిలానే ఈ మ్యాచులో కూడా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో.. కేన్ విలియమ్సన్‌లను సన్‌రైజర్స్ నమ్ముకుంటోంది.
ఈ సీజన్లో వార్నర్ మోస్తరు ప్రదర్శనకే పరిమితం అవుతున్నాడు. ఓపెనర్‌గా వార్నర్ పరుగులు సాధిస్తున్నా ధాటిగా ఆడలేకపోతున్నాడు. తన మార్క్ ఆట ఆడాల్సి ఉంది. ఇక ఢిల్లీపై సూపర్ ఓవర్‌లో వార్నర్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటివి సరిదిద్దుకోవాల్సి ఉంది. బెయిర్‌స్టో, విలియమ్సన్ ఫామ్‌లో ఉండటం హైదరాబాద్‌కు ఊరటనిచ్చే అంశం.

విరాట్ ఔట్
సన్‌రైజర్స్ జట్టుకు ఉన్న సమస్య ఒకటే. అదే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్. మిడిల్‌లో సరైన ఆటగాళ్లు లేక ఇప్పటికే నాలుగు ఓటములు చవిచూసింది. విజయ్ శంకర్, కేదార్ జాదవ్, విరాట్ సింగ్, అభిషేక్ శర్మలు పూర్తిగా విఫలమయ్యారు. నిలకడలేమితో జట్టుకు భారంగా మారారు. అయినా కూడా వీరిని కొనసాగించడం తప్పితే వార్నర్‌కు మరో ఆప్షన్ లేదు.
గత మ్యాచులో 14 బంతుల్లో 4 రన్స్ చేసిన విరాట్ బదులు ఈ రోజు మనీష్ పాండే జట్టులోకి రానున్నాడు. పాండే వేగంగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్ విభాగం తేలిపోతోంది. గత మ్యాచులో ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్, అభిషేక్ శర్మ ధారాళంగా పరుగులు ఇచ్చారు. దీంతో సన్‌రైజర్స్ స్టార్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఫిట్‌నెస్ కారణంగా భువీ ఈ మ్యాచుకు దూరం కానున్నాడు. రషీద్ ఖాన్‌కు తోడు ఖలీల్, సిద్దార్థ్ మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది.

పటిష్టంగా చెన్నై
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయంపై కన్నేసింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ దంచి కొడుతున్నారు. ఆపై మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా ఫామ్ అందుకున్నాడు. అంబటి రాయుడు ధాటిగా ఆడుతున్నా.. భారీ స్కోర్లు చేయడం లేదు. ఇక కెప్టెన్ ఎంఎస్ ధోనీ మంచి ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు.
మ్యాచ్‌ను ఫినిష్ చేసేందుకు రవీంద్ర జడేజా ఉండనే ఉన్నాడు. లోయర్ ఆర్డర్‌లో డ్వేన్ బ్రావో, సామ్ కరన్, శార్దూల్ ఠాకూర్ తలో చేయి వేయగలరు. బౌలింగ్ విభాగంలో దీపక్ చహర్, కరన్, శార్దూల్, జడేజా మెరుస్తున్నారు. వీరికి ఇమ్రాన్ తాహిర్ కూడా జతయ్యాడు. అవసరం అయితే బ్రావో కూడా బౌలింగ్ చేస్తాడు. మొత్తానికి చెన్నై అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది.

తుది జట్లు (అంచనా)
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, సామ్ కరన్, డ్వేన్ బ్రావో, ఇమ్రాన్ తాహిర్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్.
హైదరాబాద్: డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, జగదీష సుచిత్, ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్.
డ్రీమ్ 11 టీం:
జానీ బెయిర్‌స్టో, రుతురాజ్ గైక్వాడ్, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ (వైస్ కెప్టెన్), ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, సామ్ కరన్, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, జగదీష సుచిత్, దీపక్ చహర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications