
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) స్టార్ బ్యాట్స్‌మన్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో రైనా 200 సిక్సుల మార్క్ అందుకున్నాడు. వాంఖడే మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరుగుతున్న మ్యాచ్‌లో మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ చివరి బంతిని లాంగాన్ మీదుగా సిక్సర్‌గా మలిచిన రైనా ఈ మైలురాయిని అందుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో 200 సిక్సర్లు కొట్టిన 7వ ఆటగాడిగా రైనా నిలిచాడు.
ఐపీఎల్ టోర్నీలో అత్యధిక సిక్సులు బాదిన రికార్డు విండీస్ హిట్టర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌పై ఉంది. గేల్ 354 సిక్సర్లతో టాప్‌లో ఉన్నాడు. మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ (240) హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(222), టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (217), భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ (204), విండీస్ హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్ (202) ఈ జాబితాలో తొలి ఆరు స్థానాల్లో ఉన్నారు. హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా 200 సిక్సులు మార్క్ చేరుకోవడానికి అతి చేరువలో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో చెన్నై భారీ స్కోరు చేసింది. ఆరంభంలో ఫాఫ్ డుప్లెసిస్ (50: 41 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్), ఇన్నింగ్స్ చివరలో రవీంద్ర జడేజా (62 నాటౌట్: 28 బంతుల్లో 4ఫోర్లు, 5సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. హర్షల్ పటేల్ వేసిన 20వ ఓవర్లో జడేజా వరుసగా 6 6 N(నోబాల్) 6 6 2 6 4 బాదడంతో ఒకే ఓవర్లో 37 పరుగులు వచ్చాయి. జడ్డూ వీరవిహారం చేయడంతో చెన్నై అనూహ్యంగా 190 మార్క్ దాటింది.
చెన్నై నిర్దేశించిన 192 పరుగుల ఛేదనలో బెంగళూరు స్వల్ప వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. సామ్ కరన్ వేసిన నాలుగో ఓవర్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (8) ఔటవగా.. శార్దుల్ ఠాకూర్ వేసిన తర్వాతి ఓవర్లో దూకుడుగా ఆడుతున్న దేవదత్ పడిక్కల్ (34) పెవిలియన్ చేరాడు. పవర్‌ప్లే ముగిసేసరికి బెంగళూరు 65/2తో కష్టాల్లో పడింది. ఇక జడేజా వేసిన ఏడో ఓవర్‌లో వాషింగ్టన్ సుందర్ (7).. 9వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ (22) వెనుదిరిగారు.