
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో 20 ప్రపంచకప్, యాషెస్ సిరీస్ ఉండడంతో బయో బబుల్‌లో ఉండడం ఇష్టం లేక.. ఫ్యామిలీతో సమయం గడపాలనే తాను ఐపీఎల్ ఆడడం లేదంటూ హాజిల్‌వుడ్ స్పష్టం చేశాడు. దీంతో హాజిల్‌వుడ్ స్థానంలో ఎవరిని తీసుకోవాలదానిపై సీఎస్‌కే తర్జనభర్జన పడుతోంది. అయితే ఆసీస్ పేసర్ బిల్లీ స్టాన్‌లేక్‌తో పాటు ఇంగ్లండ్ బౌలర్ రీస్ టోప్లీ పేర్లను సీఎస్‌కే పరిగణలోకి తీసుకొని వారి వద్ద విషయాన్ని ప్రస్తావించింది.
అయితే అనూహ్యంగా బిల్లీ స్టాన్‌లేక్, రీస్ టోప్లీలు సీఎస్‌కే ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం తెసులుస్తోంది. తాము సీఎస్‌కేకు ఆడలేమని, అసలు ఐపీఎల్ 2021లో కూడా పాల్గొనే అవకాశం లేదంటూ స్పష్టం చేశారట. భారత్‌లో ఇటీవల కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయని, ఒకవేళ ఐపీఎల్‌లో ఆడేందుకు వచ్చినా బయోబబుల్ ఉంటూ మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుందన్నారు. అందుకే సీఎస్‌కే ఇచ్చిన ఆఫర్‌ను తాము తిరస్కరించినట్లు ఈ ఇద్దరు పేర్కొన్నారట. ఐపీఎల్ 2020 సీజన్‌లో జోష్ హేజిల్‌వుడ్‌ని రూ.2 కోట్లకి చెన్నై కొనుగోలు చేయగా.. ఐపీఎల్ 2021 సీజన్‌కి కూడా అదే ధరకి రిటైన్ చేసుకుంది. అదే ధరకు ఆడమని చెన్నై వీరిద్దరిని సంప్రదించింది.
ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభం కాకముందే కరోనా కలవరం పుట్టిస్తోంది. ఆటగాళ్లంతా వరుసగా కరోనా బారీన పడుతున్నారు. కేకేఆర్ నుంచి నితీష్ రాణా.. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అక్షర్ పటేల్‌లు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కాగా.. తాజగా ఆర్‌సీబీ ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌కు కూడా కరోనా సోకింది. అంతేగాక శనివారం ముంబైలోని వాంఖడే స్టేడియం సిబ్బందిలో 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ముంబైలో మ్యాచ్‌ల నిర్వహణపై బీసీసీఐ పునరాలోచనలో పడింది.
యూఏఈలో జరిగిన ఐపీఎల్-2020లో చెన్నై పేలవంగా ఆడింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై జట్టు 14 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు.. ఎనిమిది ఓటములతో తొలిసారి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ప్రస్తుత సీజన్‌కు ముందు కొందరు ఆటగాళ్లను వదిలేసిన సీఎస్‌కే.. భారీ ధర పెట్టి కృష్ణప్ప గౌతమ్, మొయిన్ అలీని కొనుగోలు చేసింది. ఇక రాజస్థాన్ నుంచి రాబిన్ ఉతప్పను బదిలీ చేసుకుంది. ఈ ముగ్గురూ చేరడం జట్టుకు అదనపు బలం అనే చెప్పాలి.