న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ మినీ వేలం తేదీ ఖరారైంది. చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న వేలం నిర్విహించనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఐపీఎల్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. 'అలెర్ట్.. ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం చెన్నై వేదికగా జరుగుతుంది' అని ట్వీట్లో పేర్కొన్నారు.
ఇప్పటికే టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలు రిటైన్, వేలంలోకి వదిలేసిన ఆటగాళ్ల జాబితాని బీసీసీఐకి సమర్పించాయి. కాగా, ఈ వేలంలో అత్యధిక డబ్బుతో కింగ్స్ పంజాబ్ బరిలోకి దిగనుంది. కింగ్స్ ఎల్వెన్ పంజాబ్ వద్ద రూ. 53.2 కోట్లు ఉన్నాయి.
ఇక 10 మంది ఆటగాళ్లను వదులుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వద్ద (రూ.35.7 కోట్లు), రాజస్థాన్ రాయల్స్ (రూ.34.85 కోట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (రూ.22.9 కోట్లు), ముంబై ఇండియన్స్ (రూ.15.35 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద (12.8 కోట్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్ (రూ.10.85 కోట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ.10.75 కోట్లు) ఉన్నాయి.
అయితే ఇటీవల ఫ్రాంఛైజీల వదులుకున్న ఆటగాళ్లలో ఆస్ట్రేలియా ప్లేయర్లు మాక్స్వెల్, స్టీవ్ స్మిత్‌పై అందరి చూపు నెలకొంది. ఏ ఫ్రాంఛైజీ వారిద్దరిని సొంతం చేసుకుంటుందనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. స్మిత్‌ను రాజస్థాన్, మాక్సీని పంజాబ్ వదులుకున్న సంగతి తెలిసిందే. అంతేగాక ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సత్తాచాటిన ఆటగాళ్లకు వేలంలో మంచి డిమాండ్ ఉండనుంది.
(రిలీజ్, రిటైన్ ఆటగాళ్ల జాబితా కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి)
IPL 2021: ఫ్రాంచైజీలు రిలీజ్, రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే!