KKR vs CSK: 'సహచరులకి నా మొహం ఎలా చూపించను.. అవమానంతో డ్రెస్సింగ్ రూమ్‌కి కూడా వెళ్లలేదు'

ముంబై: కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్.. ఈ సీజన్ హైవోల్టేజ్ మ్యాచ్‌ల్లో ఒకటి. ముందుగా చెన్నై 220 భారీ స్కోరు చేస్తే.. అనంతరం కోల్‌కతా 202 పరుగులకు వచ్చి ఆగిపోయింది. పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్ (54: 22 బంతుల్లో 3x4, 6x6) క్రీజులో ఉన్నంతసేపు కోల్‌కతా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అయితే చెన్నై పేసర్ సామ్ కరన్ లెగ్ స్టంప్ లైన్‌పై విసిరిన బంతిని వైడ్‌గా భ్రమించిన రసెల్.. వదిలేసే ఉద్దేశంతో కాస్త ముందుకు జరిగాడు. దాంతో బంతి నేరుగా వెళ్లి లెగ్ స్టంప్‌ని గీరాటేసింది. ఊహించని విధంగా ఔటవడంతో రసెల్ అసహనంగా మైదానం వీడాడు.

మెట్లపై కూర్చొని:
దినేశ్ కార్తీక్‌తో కలిసి 83 పరుగులు జత చేసిన అనంతరం ఆండ్రీ రసెల్ ఆరో వికెట్‌గా ఔటైన తర్వాత అతను డగౌట్‌లోని మెట్లపైనే కూర్చుండిపోయాడు. గ్లౌజ్‌లు, ప్యాడ్లు, హెల్మెట్ తీయకుండా అలానే మ్యాచ్ చూస్తూ ఉండిపోయాడు. అనవసరంగా ఔట్ అయ్యాననే బాధ రసెల్‌లో స్పష్టంగా కనబడింది. కీలక సమయంలో ఔట్ అయిపోయినందకు రసెల్‌లో పశ్చాత్తాపం కనిపించింది. మ్యాచ్ ముగిసి పోయిన తర్వాత రసెల్ అలా మెట్లపై కూర్చొండిపోవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై తాజాగా రసెల్ వివరణ ఇచ్చాడు. అలా ఊరికే ఔట్ అయ్యేసరికి తన సహచరులకి మొహం చూపించలేక అక్కడే కూర్చొన్నా అని స్పష్టం చేశాడు.

అవమానంతో డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లలేదు:
'నేను చాలా ఎమోషనల్. లెగ్ స్టంప్‌పైకి నేరుగా వచ్చిన బంతిని వదిలేసి క్లీన్ బౌల్డయిన తర్వాత నా మొహం సహచరులకి ఎలా చూపించను. అందుకే అవమానంతో డ్రెస్సింగ్ రూముకి కూడా వెళ్లలేకపోయా. మ్యాచ్‌లో అప్పటికి నా పని ఇంకా పూర్తికాలేదు. జట్టుని గెలుపు తీరాలకి చేర్చాలని ఆశించా. ఇలాంటి ఎమోషన్ నాలోని అత్యుత్తమ ఆటని వెలికితీస్తోంది. మా జట్టును గాడిలో పెట్టడమే నా ముందున్న కర్తవ్యం' అని రసెల్ తన ఫ్రాంచైజీ కేకేఆర్ డాట్ ఇన్‌లో తెలిపాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ శనివారం రాత్రి 7.30 గంటలకి వాంఖడేలో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.

21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ:
221 పరుగుల భారీ ఛేదనలో దూకుడుగా ఆడేసిన రసెల్.. ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాది 24 పరుగుల్ని పిండుకున్నాడు. 11వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన రవీంద్ర జడేజా బౌలింగ్‌లోనూ ఒక సిక్స్, ఫోర్ కొట్టి 14 పరుగులు రాబట్టాడు. దీంతో 21 బంతుల్లోనే రసెల్ హాఫ్ సెంచరీ చేసి.. కోల్‌కతా శిబిరంలో మళ్లీ ఆశలు రేపాడు. అతని విధ్వంసంతో కోల్‌కతా 13 బంతుల్లోనే 39 పరుగుల్ని చేసింది. అయితే 12వ ఓవర్‌లో బౌలింగ్ వచ్చిన సామ్ కరన్.. కోల్‌కతాకు ఊహించని షాక్ ఇచ్చాడు.

ఈ సీజన్‌లో ఒకే విజయం:
కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకే విజయం సాధించింది. తొలి పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిన మోర్గాన్ సేన తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లు ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇక శనివారం తర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్‌తో తలపడనుంది. ఇప్పటికైనా విజయం సాధిస్తుందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications