
షార్జా: ఊహించినట్టే.. యూనివర్సెల్ బాస్ క్రిస్ గేల్ రాకతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తలరాత మారినట్టయింది. ఈ ఐపీఎల్-2020 సీజన్‌లో వరుస పరాజయాలతో కుదేల్ అయిన పంజాబ్ జట్టు ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకుందంటే దానికి కారణం క్రిస్ గేల్. చివరి వరకూ క్రీజ్‌లో ఉన్నాడు. తనదైన శైలికి భిన్నంగా కుదురుగా ఆడాాడు. దూకుడును ప్రదర్శించలేదు. వికెట్ పడకుండా కాపాడుకోగలిగాడు. ఇన్నింగ్ చివరి ఓవర్ అయిదో బంతికి రనౌట్‌గా వెనుదిరిగినప్పటికీ.. ఒక బంతికి ఒక పరుగే చేయాల్సిన రావడం వల్ల పెద్దగా కంగారు పడలేదా జట్టు.
షార్జా స్టేడియంలో గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. తాను ఎంత విలువైన ఆడగాడనే విషయాన్ని మరోసారి అతను రుజువు చేసుకున్నాడు. అర్ధసెంచరీతో అదరగొట్టాడు. 45 బంతుల్లో అయిదు సిక్సులు ఒక ఫోర్‌తో 53 పరుగులు చేశాడు. కింగ్స ఎలెవెన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న క్రిస్ గేల్.. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్ ఇదే. తనపై జట్టు ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అభిమానులను నిరాశ పర్చలేదు. తాను క్రీజులో ఉంటే.. గెలుపుపై ఢోకా లేదని భరోసాను పంపించాడతను.
అదే జట్టుకు చెందిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, పించ్ హిట్టర్ నికొలస్ పూరన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. క్రిస్ గేల్ క్రీజ్‌లో ఉన్నంత సేపూ విజయం ఢోకా ఉండబోదని అన్నాడు. అతను ఉన్నాడంటే గెలిచి తీరుతామనే నమ్మకం టీమ్ అందరిలోనూ ఉంటుందని చెప్పాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ సైతం స్ఫూర్తి పొందేలా గేల్ బ్యాటింగ్ చేయగలడని, ప్రతి క్రికెటర్ కూడా అతనిలా ఆడాలని కోరుకుంటాడని చెప్పాడు. బ్యాటింగ్‌లో ఓ బెంచ్ మార్క్‌ను క్రిస్ గేల్ నెలకొల్పాడని అన్నాడు.
మ్యాచ్ ముగిసిన అనంతరం తన టీమ్ మేట్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కు సరదాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. తన వరకు క్రిస్ గేల్ టీ20లో అత్యుత్తమ ప్లేయర్ అని చెప్పుకొచ్చాడు. గెలుపుపై ఆశలు కల్పించేలా అతని బ్యాటింగ్ శైలి ఉంటుందని, పరిస్థితులకు అనుకూలంగా తనను తాను మలచుకోవాలనే సందేశాన్ని ఇస్తుందని అన్నాడు. అతను డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటే.. దాని వాతావరణమే మారిపోతుందని, సానుకూల దృక్పథం అలవాటవుతుందని నికొలస్ పూరన్ చెప్పాడు.