
తొలి బంతికి కాస్త భయపడ్డా:
ఐపీఎల్ 2020 కోసం గతవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యూఏఈ వెళ్లింది. నిబంధనల ప్రకారం 6 రోజుల క్వారంటైన్ ముగించుకున్న బెంగళూరు జట్టు ఆదివారం నెట్స్‌లో చెమటోడ్చింది. ప్రాక్టీస్ సెషన్‌తో పాటు విరాట్ కోహ్లీ అనుభవాలను ఆ జట్టు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 'నిజంగా చెబుతున్నా. తొలి బంతి ఆడే ముందు కాస్త భయపడిన మాట వాస్తవం. ఎందుకంటే గత ఐదు నెలలుగా నేను అసలు బ్యాటే పట్టలేదు. అయితే ప్రాక్టీస్ మాత్రం ఆశించినదానికంటే అద్భుతంగానే సాగింది' అని కోహ్లీ చెప్పాడు.

జిమ్‌లో క్రమం తప్పకుండా కసరత్తులు:
లాక్‌డౌన్‌లో ఆటకు దూరమైనప్పటికీ జిమ్‌లో క్రమం తప్పకుండా కసరత్తులు చేయడం వల్లే శరీరం బాగా సహకరిస్తోందని విరాట్ కోహ్లీ చెప్పాడు. స్పిన్నర్లు యుజ్వేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, షాబాద్ నదీమ్ కొందరు పేసర్లు నెట్స్‌లో పాల్గొన్నారు. ముగ్గురు స్పిన్నర్లు బౌలింగ్‌లో చక్కగా చెమటోడ్చారని, బంతిని సరైన దిశలో తిప్పుతున్నారని బెంగళూరు కెప్టెన్ తెలిపాడు. నెట్స్ సెషన్‌లో సఫారీ పేసర్ డేల్ స్టెయిన్ కూడా పాల్గొనగా.. ఆర్‌సీబీ జట్టు డైరెక్టర్ మైక్ హెస్సన్ ప్రాక్టీస్‌ను పరిశీలించారు.

ఢిల్లీ క్యాపిటల్స్ కూడా:
దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు కూడా తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఢిల్లీ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ... 'చాన్నాళ్ల తర్వాత అందరం జట్టుకట్టాం. అందరిలోనూ సత్తాచాటాలనే ఉత్సాహం ఉంది. సానుకూలంగా సీజన్‌ను ప్రారంభించి ఈ టోర్నీలో తప్పకుండా రాణిస్తాం' అని ధీమా వ్యక్తం చేశాడు. తామిక్కడికి వచ్చి కేవలం ఆరు రోజులే అయిందని, ఈ వేడి వాతావరణానికి అలవాటు పడాలంటే ఇంకా రెండుమూడు రోజులైనా పడుతుందన్నాడు.

ప్లే ఆఫ్‌కు రెండు సార్లు మాత్రమే:
ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కే విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. కోహ్లీ ఆర్‌సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన ఏడు ఎడిషన్లలో కేవలం రెండు సార్లు మాత్రమే జట్టు ప్లే ఆఫ్‌కు వెళ్లింది. వాటిలో 2016లో ఫైనల్‌కు వెళ్లింది. గత మూడు సీజన్లలోనూ పాయింట్ల పట్టికలో 8, 6, 8వ స్థానాలతో బెంగళూరు సరిపెట్టింది. దాంతో విరాట్ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.


Click it and Unblock the Notifications












