
దుబాయ్: రన్ మెషిన్ విరాట్ కోహ్లీ నేడు 33వ వసంతంలోకి అడుగుపెట్టాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, ఆర్సీబీ జట్టు సభ్యులతో కలిసి బర్త్ డే సెల్రబేషన్స్ జరుపుకున్నాడు. అబుదాబీలో ఓ ప్రయివేట్ యాచ్‌లో టీమిండియా కెప్టెన్ పుట్టిన రోజు వేడుకలను ఆర్సీబీ యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. ప్రెగ్నెంట్ అయిన అనుష్క శర్మ తన భర్త కోహ్లీకి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపింది. ఆ తర్వాత బెంగళూరు ఆటగాళ్లు కోహ్లీ ముఖానికి కేక్ పూసి సందడి చేశారు. వేడుకలో ఆటపాటలు, డ్యాన్సులతో అలరించారు. కోహ్లీ పుట్టిన రోజు సంబరాలకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆర్సీబీ పోస్ట్ చేసిన వీడియో ఆ జట్టు సభ్యులు అందరూ ప్రత్యేకంగా మాట్లాడుతూ తమ సారథికి బర్త్ డే విషెష్ చెప్పారు. కోచ్, సహాయ సిబ్బంది కూడా విరాట్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. పార్టీ సందర్భంగా ఉమేశ్ యాదవ్‌తో కలిసి తను డ్యాన్స్ చేసిన వీడియోను హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ట్వీట్ చేశాడు. ఇక విరాట్ ముఖం మొత్తం కేక్ పూసిన ఫొటోలను ఆర్సీబీ ట్వీట్ చేసింది. 'అలా మొదలైంది.. ఇలా ముగిసింది.. కెప్టెన్ కోహ్లీ జన్మదిన వేడుక కూడా తన బ్యాటింగ్‌లాగే గొప్పగా సాగింది' అని ఆ ట్వీట్‌లో పేర్కొంది. సామాజిక మాధ్యమాల వేదికగా ఇప్పటికే పలువురు క్రికెట్, సినిమా ప్రముఖులు కోహ్లీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
తన బర్త్ డే సెల్రబేషన్స్‌కు సంబంధించిన వీడియోను విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కోహ్లీ భార్య అనుష్క ప్రెగ్నెంట్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వచ్చే జనవరిలో తమ ఇంట్లోకి మూడో వ్యక్తి ప్రవేశించబోతున్నట్లు విరుష్కలు ఇప్పటికే తెలిపారు. ఐపీఎల్ 13వ సీజన్‌ను ఎంజాయ్ చేయడానికి కోహ్లీతో పాటు అనుష్క యూఏఈ వెళ్లిన విషయం తెలిసిందే.
విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరోసారి ప్లేఆఫ్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. టీ20 లీగ్‌లో భాగంగా రెండో ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు హైదరాబాద్‌తో తలపడాల్సి ఉంది. శుక్రవారం అబుదాబి వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరాలంటే మరో మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. ఇక క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లో బెంగళూరు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ.. జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 191 మ్యాచ్‌లు ఆడి 5872 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో లీగ్ దశలో 460 పరుగులు చేశాడు.