ఐపీఎల్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.. సెప్టెంబరు 19న ఆరంభం.. నవంబరు 10న ఫైనల్!!

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020కి మార్గం సుగమమైంది. యూఏఈ వేదికగా లీగ్ నిర్వహించేందుకు భారత కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుండటంతో.. లీగ్‌ను దుబాయ్‌లో నిర్వహించాలని ముందే నిర్ణయించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం షెడ్యూల్ ఖరారు చేసింది. సెప్టెంబర్ 19న ప్రారంభమయ్యే ఐపీఎల్.. నవంబర్ 10 వరకు 53 రోజుల పాటు సాగనుంది. ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ నేతృత్వంలో ఆదివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

కేంద్రం గ్రీన్‌సిగ్నల్:
ఐపీఎల్ నిర్వహణకు ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అనుమతి తీసుకున్న బీసీసీఐ.. కేంద్రాన్ని ఒప్పించడానికి ముమ్మర కసరత్తు చేసింది. ఇది ఫలించడంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక పాత్ర వహించాడు. విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అవసరమైన ఉత్తర్వులు వారం రోజుల్లో వస్తాయని, ఈ నెల చివరలో జట్లు దుబాయ్‌లో అడుగుపెట్టొచ్చని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇంతకుముందు ఐపీఎల్‌ను కరోనా మహమ్మారి కారణంగా నిరవధికంగా వాయిదా వేసిన బీసీసీఐ.. టీ20 ప్రపంచకప్ వాయిదా నేపథ్యంలో టోర్నీని యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

నవంబర్ 10న ఫైనల్:
సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు లీగ్ నిర్వహించే చాన్స్ ఉందని గతంలో బ్రిజేశ్ పటేల్ ప్రకటించినా.. దీపావళి పండుగ నేపథ్యంలో బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియా కోరిక మేరకు ఫైనల్‌ను మరో రెండు రోజులు వాయిదా వేసి నవంబర్ 10గా నిర్ణయించారు. తద్వారా ఐపీఎల్ ఫైనల్ వారాంతాల్లో కాకుండా తొలిసారి మంగళవారం జరుగనుంది. భారత కాలమానం ప్రకారం ఐపీఎల్ మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి. అయితే ఈ సారి మాత్రం అరగంట ముందుగా అంటే.. రా.7.30కే మ్యాచ్‌లు మొదలు పెట్టాలని పాలక మండలి నిర్ణయించింది. టోర్నీ మొత్తంలో కేవలం 10 డబుల్ హెడర్( రోజులో రెండు మ్యాచ్‌లు) మ్యాచ్‌లే ఉన్నాయి. ఒకే రోజు రెండు మ్యాచ్‌లు ఉన్నప్పుడు మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3:30గంటలకు ఆరంభం అవుతుంది.

కొవిడ్-19 రిప్లేస్‌మెంట్:
లీగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఎవరైనా ఆటగాడు వైరస్ బారిన పడితే.. అతడి స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేసుకునే అవకాశం ఫ్రాంచైజీలకు ఉంది. ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరంభ మ్యాచ్‌లకు మాత్రం ప్రేక్షకులను అనుమ తించరాదని నిర్ణయం తీసుకున్నారు. 'కొంతమంది అభిమానులైనా మైదానంలో ఉంటే బాగుంటుంది. కానీ ఆటగాళ్ల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశంపై ఈసీబీతో మాట్లాడాక చెప్తాం' అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. ఆయా ఫ్రాంచైజీలను కూడా తమ క్రికెటర్ల వీసా ప్రక్రియను మొదలు పెట్టాల్సిందిగా సూచించారు. క్రికెటర్లందరూ (భారత్ లేదా విదేశీ) చార్టెడ్ విమానాల్లో మాత్రమే ప్రయాణించాలి.

వివో కొనసాగింపు:
ఆదివారం సమావేశమైన ఐపీఎల్ పాలకవర్గం.. టైటిల్ స్పాన్సరైన చైనా మొబైల్ కంపెనీ వివో సహా స్పాన్సర్లందరినీ కొనసాగించాలని నిర్ణయించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కెంపెనీల స్పాన్సర్‌షిప్ గురించి గత కొన్ని వారాలుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వివో ఏడాదికి రూ.440 కోట్లు చెల్లిస్తోంది. ఆ కంపెనీతో బీసీసీఐ ఒప్పందం 2022తో ముగుస్తుంది. వివోను వద్దనుకుంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత తక్కువ సమయంలో మరో కొత్త స్పాన్సర్‌ను పొందడం బోర్డుకు కష్టమయ్యేది.

పాలక మండలి ఆమోదించిన కీలక అంశాలివే:
1. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్
2. 53 రోజులు (10 రోజులు.. రోజుకు2 మ్యాచ్‌లు)
3. జట్టులో గరిష్ఠంగా 24 మంది క్రికెటర్లకు అనుమతి
4. కొవిడ్-19 ప్రత్యామ్నాయ ఆటగాళ్లకు అనుమతి
5. బయో బబుల్ ఏర్పాటుకు టాటా గ్రూప్‌తో చర్చలు
6. టైటిల్ స్పాన్సరర్‌గా వివో కొనసాగింపు
7. మహిళల లీగ్‌కు గ్రీన్‌సిగ్నల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications