
హైదరాబాద్: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కానుంది. 53 రోజుల పాటు 60 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక ఐపీఎల్ ప్రారంభం కావడానికి నెల కన్నా తక్కువ సమయమే ఉంది. ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు యూఏఈ చేరుకొని.. క్వారంటైన్‌లో ఉన్నాయి. గత ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ దుబాయ్ గడ్డపై అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ కోసం 13 మంది స్పాన్సర్‌లతో సంతకం చేసినట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ మంగళవారం ప్రకటించింది.
సన్ గ్రూప్ యాజమాన్యంలోని టీం ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రిన్సిపాల్ స్పాన్సర్ల శ్రేణిలో జేకే లక్ష్మి సిమెంట్ లిమిటెడ్ ముందు వరసలో ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో సిమెంట్ బ్రాండ్ టైటిల్ స్పాన్సర్‌గా సంతకం చేసి.. వచ్చే నెలలో ప్రారంభమయ్యే టోర్నమెంట్ కోసం ఫ్రాంచైజ్ నిలుపుకోగలిగింది. టైటిల్ స్పాన్సర్‌గా ఉన్నందున జేకే లక్ష్మి సిమెంట్ లోగోను జట్టు ఆటగాళ్ల జెర్సీ ముందు భాగంపై ముద్రిస్తారు. ప్రధాన స్పాన్సర్‌లుగ ఉన్న రాల్కో టైర్లు, వాల్వోలిన్ లోగోలు జెర్సీ ముందు వెనుక, కుడి ఎగువ ఛాతీపై ఉంటాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని జియో, ఎలక్ట్రానిక్స్ సంస్థ టీసీఎల్ టెక్నాలజీ, ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫాం డ్రీమ్ 11, జై రాజ్ స్టీల్, కాన్సాయ్ నెరోలాక్ పెయింట్స్ లిమిటెడ్, కోల్గెట్ కంపెనీలు ఐపీఎల్ సీజన్ 13 కోసం భాగస్వాములుగా సంతకం చేశాయి. వారి లోగోలు, బ్రాండింగ్‌లు జట్టు మ్యాచ్‌లో ప్రదర్శిస్తారు. స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ బ్రాండ్ టైకా, ఫ్యాన్‌కోడ్, వర్చువల్ రియాలిటీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ఐబీ క్రికెట్, ఫుడ్ బ్రాండ్ డబుల్ హార్స్ కూడా ఫ్రాంచైజీతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కె. షణ్ముగం మాట్లాడుతూ.... 'కఠినమైన సమయాల్లో ఉన్నప్పటికీ స్పాన్సర్‌ల నుంచి ఆసక్తి సానుకూలంగా, ఉంది. వారి ప్రోత్సాహం కూడా బాగుంది. మా భాగస్వాములు ఇచ్చిన మద్దతుకు మేం గర్వంగా ఫీల్ అవుతున్నాం. వారికి మా కృతజ్ఞతలు. జట్టుకు ఉత్తమమైన ప్రదర్శన కొనసాగించడానికి వారిచ్చే స్ఫూర్తి అపారమైనది' అని అన్నారు. భారత్‌లో కరోనా కేసులు అధికంగా ఉండడంతో యూఏఈలోని ఖాళీ మైదానాల్లో ఐపీఎల్ 2020 మ్యాచులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.