
అబుదాబి: ఐపీఎల్ 2020 ఎలిమినేటర్‌లో అబుదాబి వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తడబడుతోంది. సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి పరుగులు చేయలేక ఆపసోపాలు పడుతున్నారు. మిస్టర్ 360, స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ మాత్రమే పోరాడుతున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. సమయోచితంగా ఆడుతూ డివిలియర్స్ హాఫ్ సెంచరీ చేశాడు. 39 బంతుల్లో 52 పరుగులు చేశాడు. హోల్డర్ వేసిన 16వ ఓవర్ చివరి బంతికి ఫోర్ బాది హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. సన్‌రైజర్స్ బౌలర్ల దెబ్బకు బెంగళూరు 16వ ఓవర్లో 100 పరుగులు మార్క్ అందుకుంది.
బెంగళూరుకు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. జేసన్ హోల్డర్ ధాటికి బెంగళూరు 15 పరుగులకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలో దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (6) రెండో ఓవర్లోనే ఔటయ్యాడు. హోల్డర్ తన తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్(1)ను పెవిలియన్ పంపాడు. మూడో ఓవర్ వేసిన సందీప్ శర్మ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. దీంతో పవర్‌ప్లే ఆఖరికి బెంగళూరు 2 వికెట్ల నష్టానికి 9 పరుగులు చేసింది.
ఈ దశలో ఏబీ డివిలియర్స్, అరోన్ ఫించ్ క్రీజులో నిలదొక్కుకున్నారు. ఈ జోడి ఆచితూచి ఆడి మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. అయితే నెమ్మదిగా ఆడడంతో బెంగళూరు స్కోర్ వేగం పూర్తిగా తగ్గిపోయింది. ఈ సమయంలో ఫించ్ కాస్త బ్యాట్ జులిపించే ప్రయత్నం చేశాడు. అయితే షాబాజ్ నదీమ్ వేసిన 11వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్‌కు యత్నించిన ఫించ్.. అబ్దుల్ సమద్ చేతికి చిక్కాడు. అదే ఓవర్లో షాబాజ్ వేసిన ఫ్రీ హిట్ బంతికి మొయిన్ అలీ (0) రనౌటయ్యాడు. అనవసర పరుగుకు ప్రయత్నించగా రషీద్ ఖాన్ నేరుగా వికెట్లకు బంతిని విసిరాడు. ప్రస్తుతం డివిలియర్స్ , సైనీ క్రీజులో ఉన్నారు.
కీలక పోరులో ఓడిన జట్టు లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టుకు మాత్రం ఫైనల్ చేరేందుకు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే రెండో క్వాలిఫయర్ ద్వారా మరో అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా గాయం కారణంగా మ్యాచ్ ఆడడం లేదు. అతని స్థానంలో శ్రీవాట్స్ గోస్వామి జట్టులోకి వచ్చాడు.