
షార్జా: ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు సత్తాచాటారు. సందీప్ శర్మ, జాసన్ హోల్డర్, షాబాజ్ నదీమ్ చెలరేగడంతో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ చేతులెత్తేశారు. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసి.. సన్‌రైజర్స్ ముందు 150 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సూర్యకుమార్ యాదవ్ (36; 29 బంతుల్లో, 5×4), ఇషాన్ కిషన్ (33; 30 బంతుల్లో, 1×4, 2×6) రాణించారు. కీరన్ పొలార్డ్ (41; 25 బంతుల్లో, 2×4, 4×6) సిక్సర్లతో విరుచుకుపడటంతో ముంబై పోరాడే స్కోర్ చేసింది. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ మూడు వికెట్లు తీశాడు.
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడంతో ముంబై బ్యాటింక్‌కు దిగింది. ముంబై ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ, డీకాక్‌లు ఆరంభించారు. సందీప్ శర్మ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి రోహిత్ (4) ఔటయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్-డీకాక్‌లు ఇన్నింగ్స్‌ను నడిపించారు. డీకాక్ దూకుడుగా ఆడాడు. సందీప్ వేసిన ఐదో ఓవర్‌లో వరుస రెండు సిక్స్‌లు కొట్టిన డీకాక్.. అదే ఓవర్ ఐదో బంతికి బౌల్డ్ అయ్యాడు. బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ గిరాటేయడంతో డీకాక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
ఆపై సూర్యకుమార్-ఇషాన్ కిషన్‌లు బ్యాట్ ఝుళిపించారు. అయితే నదీమ్ వేసిన 12 ఓవర్ తొలి బంతికి సూర్యకుమార్ స్టంపౌట్ కాగా.. ఆ ఓవర్ నాల్గో బంతికి కృనాల్ పాండ్యా డకౌట్ అయ్యాడు. రషీద్ ఖాన్ వేసిన 13 ఓవర్ తొలి బంతికి సౌరవ్ తివారీ (1) ఔటయ్యాడు. కీపర్ సాహా క్యాచ్ పట్టడంతో తివారీ పెవిలియన్ చేరాడు. దీంతో ఒక పరుగు వ్యవధిలో ముంబై మూడు వికెట్లు కోల్పోయింది. 39 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ముంబై.. 82 పరుగుల స్కోరు చేరే సరికి ఐదు వికెట్ల నష్టపోయింది.
ఈ సమయంలో ఇషాన్-పొలార్డ్‌లు స్కోరును చక్కదిద్దే యత్నం చేశారు. ఈ జోడి 33 పరుగులు జత చేసిన తర్వాత ఇషాన్ ఔటయ్యాడు. సందీప్ వేసిన 17 ఓవర్ మూడో బంతికి బౌల్డ్ అయ్యాడు. హోల్డర్ వేసిన 18 ఓవర్ రెండో బంతికి కౌల్టర్ నైల్ (1) ఔటయ్యాడు. ఇన్నింగ్స్ చివర్లో పొలార్డ్ మెరుపులు మెరిపించాడు. నటరాజన్ వేసిన 19 ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. హోల్డర్ వేసిన ఆఖరి ఓవర్‌లో సిక్స్ కొట్టిన తర్వాత బంతికి బౌల్డ్ అయ్యాడు. చివరకు ముంబై 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ మూడు వికెట్లు తీయగా.. నదీమ్,హోల్డర్ చెరో రెండు వికెట్లు తీశారు.