
దుబాయ్: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో సరికొత్త రికార్డు నమోదైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరుగుతున్నా మ్యాచులో వెస్టిండీస్ హార్డ్ హిట్టర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ అత్యంత వేగవంతమైన అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో ఐపీఎల్-13వ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదయింది. అయితే ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం బాదిన జాబితాలో మాత్రం పూరన్ రెండో స్థానంలో నిలిచాడు.
ఆరంభం నుంచి పడుతూలేస్తూ సాగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్‌కు నికోలస్ పూరన్ ఒక్కసారిగా ఊపు తీసుకొచ్చాడు. యువ స్పిన్నర్ అబ్దుల్ సమద్ వేసిన తొమ్మిదో ఓవర్లో వరుసగా 6, 4, 6, 6, 6 బాది 22 రన్స్ రాబట్టాడు. ఈ క్రమంలోనే 17 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో తన ఐపీఎల్ కెరీర్‌లో మొదటి హాఫ్‌సెంచరీ సాధించాడు. అంతేకాదు ఐపీఎల్-13వ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం కూడా చేశాడు. ఇక పంజాబ్ తరఫున వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. లోకేశ్ రాహుల్ మొదటి క్షణంలో ఉన్నాడు.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. 2018లో ఢిల్లీపై 14 బంతుల్లో రాహుల్ ఫిఫ్టీ బాదాడు. కరేబియన్ స్టార్ స్పిన్నర్ సునిల్ నరైన్ 15 బంతుల్లో అర్ధ సెంచరీ బాది రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. యూసుఫ్ పఠాన్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) కూడా 15 బంతుల్లో ఫిఫ్టీ కొట్టి నరైన్‌తో సహా రెండో స్థానంలో ఉన్నాడు. 16 బంతుల్లో ఫిఫ్టీ చేసిన టీ20 స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా (చెన్నై సూపర్ కింగ్స్) మూడో ప్లేస్‌లో ఉన్నాడు.
ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ (9), సిమ్రాన్ సింగ్ (11), కేఎల్ రాహుల్ (11) పూర్తిగా నిరాశపరిచాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (7) రనౌట్ అయ్యాడు. నికోలస్ పూరన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతనికి సహకారం అందించే బ్యాట్స్‌మన్ కరువయ్యాడు. దీంతో రన్ రేట్ భారీగా పెరిగిపోవడంతో.. ధాటిగా ఆడే క్రమంలో పూరన్ (77) పెవిలియన్ చేరాడు. పంజాబ్ విజయం సాధించాలంటే 22 బంతుల్లో 70 పరుగులు చేయాలి.