
దుబాయ్: ఐపీఎల్ 2020లో ఆశలు అడుగంటిన వేళ సన్‌రైజర్స్ హైదరాబాద్ అదిరిపోయే విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మిగిలిన మ్యాచ్‌లన్నీ గెలిచినా.. ఇతర జట్ల గెలుపోటములపై సమీకరణాలు ఆధారపడి ఉన్న తరుణంలో సమిష్టిగా సత్తాచాటింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 88 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కొత్త ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (45 బంతుల్లో 87; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), బర్త్‌డే బాయ్ డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 66; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ (3/7) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
టోర్నీలో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించడం ఒకవైపు, కెప్టెన్ డేవిడ్ వార్నర్ బర్త్‌డే మరోవైపు వెరసి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు హంగామా చేశారు. డబుల్ ధమాకా నేపథ్యంలో కేక్ కట్ చేసి డ్రెస్సింగ్‌రూంలో సందడి వాతావరణం నెలకొల్పారు. ప్రియంగార్గ్, మనీష్ పాండే సహా ఇతర ఆటగాళ్లు వార్నర్ ముఖాన్ని కేక్‌తో నింపేశారు. ఆ తర్వాత వార్నర్ అందరి మీదకు కేక్ విసురుతూ సందడి చేశాడు. బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ వద్దకు పరుగెత్తుకువెళ్లి అతడి ముఖానికి కూడా కేక్ పూశాడు.
బర్త్‌డే బాయ్ డేవిడ్ వార్నర్ కేక్ పట్టుకుని పరుగెత్తుతుంటే మిగతా ఆటగాళ్లంతా ఈ సంతోష క్షణాలను సెల్‌ఫోన్‌లో బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'గత రాత్రి కీలక మ్యాచ్‌లో గెలిచిన తర్వాత డ్రెస్సింగ్‌రూంలో ఏం జరిగిందో చూడండి. కేక్ ఫైట్‌ను అస్సలు మిస్పవకండి' అంటూ కాప్షన్ జతచేశాడు. ఆరెంజ్ కలర్‌లో ఉన్న ఓ హార్ట్ ఎమోజీని కూడా జతచేసింది. ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ చేశాడు. ఐపీఎల్‌లో వార్నర్ బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి. అయితే వార్నర్ కేవలం ఒకే క్క బంతి వేశాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్ బౌలింగ్ చేసిన విజయ్ శంకర్ 7 పరుగులు ఇచ్చాడు. 12వ మూడో బంతికి ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను ఔట్ చేశాడు. ఐదో బంతి అనంతరం అతడు గాయపడ్డాడు. ఎడమ కాలి తొడ కండరం పట్టేయడంతో మరో బంతి వేయకుండానే శంకర్ మైదానాన్ని వీడాడు. దీంతో వార్నర్ చివరి బంతిని పూర్తి చేశాడు. అయితే మొదటగా వైడ్ వేసిన వార్నర్.. తర్వాత లీగల్ డెలివరీ వేశాడు. వార్నర్ ఒక బంతి వేసి రెండు పరుగులు ఇచ్చాడు.