
రషీద్ సిక్స్, ఫోర్:
సన్‌రైజర్స్ హైదరాబాద్ 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. 17వ నాలుగో బంతికి విజయ్ శంకర్ (12) ఔట్ అయ్యాడు. అప్పుడు రషీద్ ఖాన్ క్రీజులోకి వచ్చాడు. ఇక సన్‌రైజర్స్ విజయానికి మూడు ఓవర్లలో 46 పరుగులు అవసరం. కర్ణ్ శర్మ వేసిన 18వ ఓవర్ మొదటి బంతికి కేన్ విలియమ్సన్ ఫోర్ బాది స్కోర్ వేగం పెంచాడు. అయితే విలియమ్సన్ (57) ఆ తర్వాతి బంతికే భారీ షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. రషీద్ మూడో బంతికి సిక్స్, నాలుగో బంతికి ఫోర్.. నదీమ్ చివరి బంతికి మరో ఫోర్ బాదడంతో ఆ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. దీంతో సన్‌రైజర్స్ సమీకరణం ఒక్కసారిగా మారిపోయింది.
హెలికాప్టర్ షాట్ ఆడబోయి:
సన్‌రైజర్స్ విజయం సాధించాలంటే చివరి రెండు ఓవర్లలో 27 పరుగులు చేయాలి. 19వ ఓవర్ చేసేందుకు శార్దుల్ ఠాకూర్ బౌలింగ్‌కు దిగాడు. మొదటి బంతికి రషీద్ ఖాన్ రెండు పరుగులు చేశాడు. రెండో బంతిని ఠాకూర్ వైడ్ యార్కర్‌గా వేశాడు. ఆ తరువాతి బంతిని కూడా బ్యాట్స్‌మెన్‌కు అందకుండా వేశాడు. ఆ తర్వాత మరో రెండు సింగిల్స్ మాత్రమే రావడంతో.. రన్‌రేట్ అమాంతం పెరిగిపోయింది. దీంతో చివరి బంతికి ఎంఎస్ ధోనీ తరహాలో హెలికాప్టర్ షాట్ ఆడేందుకు రషీద్ సిద్దమయిపోయాడు. ఇక్కడే ఠాకూర్ తన తెలివిని ప్రదర్శించాడు.

హిట్ వికెట్‌గా ఔట్:
శార్దుల్ ఠాకూర్ చివరి బంతిని లో ఫుల్ టాస్ వేయగా.. రషీద్ ఖాన్ వికెట్లను దగ్గరగా వెళ్లి హెలికాప్టర్ షాట్ ఆడాడు. బ్యాట్‌ను బంతి సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో అది నేరుగా వెళ్లి లాంగాన్‌లో ఉన్న ఫీల్డర్ దీపక్ చహర్ చేతుల్లో పడింది. ఇంకేముంది రషీద్ ఔట్ అయ్యాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చహర్ క్యాచ్ పట్టకముందే.. రషీద్ ఔట్ అయ్యాడు. షాట్ ఆడే క్రమంలో రషీద్ ఆఫ్ స్టంప్‌ని కాలితో తొక్కేశాడు. అప్పుడే అతడు హిట్ వికెట్‌గా ఔట్ అయ్యాడు. చహర్ క్యాచ్ కూడా పట్టడంతో ఒకే బంతికి రెండు సార్లు ఔట్ అయ్యాడు ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ సంచలనం. మొత్తానికి రషీద్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. 'ర్యాన్ డి సా' అనే అభిమాని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

20 పరుగుల తేడాతో ఓటమి:
దుబాయ్ వేదికగా వార్నర్ సేనతో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ (42; 38 బంతుల్లో, 1×4, 3×6), అంబటి రాయుడు (41*, 34 బంతుల్లో, 3×4, 2×6) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది. కేన్ విలియమ్సన్ (57; 39 బంతుల్లో, 7×4) పోరాడాడు.


Click it and Unblock the Notifications












