
దుబాయ్: టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోనీ. ప్రపంచ క్రికెట్‌లో కూడా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన సారథి కూడా ఆయనే. టీమిండియా ఖాతాలోకి మూడు మేజర్ ట్రోఫీలు వచ్చాయంటే.. దానికి ప్రధాన కారణం మహీ కెప్టెన్సీనే. వికెట్ల వెనకాల ఉండి మైదానంలో ఏం జరుగుతుందో అన్నీ పరిశీలిస్తాడు. ఏ బ్యాట్స్‌మన్‌కు ఎలాంటి బౌలింగ్ చేయించాలి.. ఎవరితో బంతులు వేయించాలి.. ఫీల్డర్లను ఎక్కడ మోహరించాలి.. మ్యాచును మలుపు తిప్పాలంటే ఏం చేయాలి ఇలాంటి విషయాల్లో ధోనీ ఆరితేరాడు. ధోనీ ఓ ప్రణాళిక వేశాడంటే అది 100 శాతం సక్సెస్ అవుతుంది. అయితే తనలోని విజ్ఞానాన్ని జూనియర్లకు పంచడంలో మహీ ఎప్పుడూ ముందుంటాడు.
సన్‌రైజర్స్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఎంఎస్ ధోనీ మెంటార్ అవతారం ఎత్తాడు. సన్‌రైజర్స్ యువ ఆటగాళ్లు ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, సందీప్ శర్మ, షాబాజ్ నదీమ్ లాంటి యువ ఆటగాళ్లకు ధోనీ విలువైన సలహాలు ఇచ్చాడు. వారందరూ మహీ చుట్టూ చేరి.. అతడు చెబుతున్న విషయాలను శ్రద్దగా విన్నారు. మహీ ఎక్కువ సమయం గార్గ్ తో ముచ్చటించాడు. దీనికి సంబందించిన ఫొటోను ట్వీట్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. 'మన ప్రపంచం చుట్టూ సూర్యుళ్లు' అని క్యాప్షన్ పెట్టింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా ఎంఎస్ ధోనీ.. యువ ఆటగాళ్లకు ఇచ్చే సలహాలను వీడియోతో పంచుకుంది. 'ఎంఎస్ ధోనీ మైదానంలో బిజీగా ఉన్నాడు. తనలోని విజ్ఞానాన్ని జూనియర్లకు పంచడంలో మహీ ఎప్పుడూ ముందుంటాడు' అని ఐపీఎల్ కాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేసున్నారు. కోచ్‌గా మారి యువ ఆటగాళ్లకు సలహాలు ఇస్తున్నాడు అని, ధోనీ త్వరలోనే టీమిండియా కోచ్ అవ్వాలని ఫాన్స్ ఆశిస్తున్నారు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఈనెల 4న జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ వ్యూహాలు సక్సెస్ అవగా.. కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత చెన్నై కెప్టెన్ ధోనీ క్రీడాస్ఫూర్తిని చాటాడు. పంజాబ్ సారథి కేఎల్ రాహుల్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో ప్రత్యేకంగా సంభాషించాడు. ఏ సమయంలో ఎలా ఆడాలి, ఎలాంటి షాట్లు బాదాలి, మ్యాచ్‌ను ఎలా అధ్యయనం చేయాలి వంటి అంశాలను వారికి వివరించాడు.