
దుబాయ్: మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ పరాజయంపై ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. బ్యాటింగ్‌లో వైఫల్యాల కారణంగా జట్టు ఓటమి పాలవుతున్నట్లు తెలిపాడు. సన్‌రైజర్స్ జట్టుకు మరో పూర్తిస్థాయి బ్యాట్స్‌మెన్ అవసరం ఉందని వార్నర్ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్ పూర్తిగా విఫలమయ్యాడు. 13 బంతులు ఆడి 9 పరుగులే చేశాడు. ఓపెనర్ అయిన వార్నర్ ఒక్క బౌండరీ కూడా బాధలేకపోయాడు.
మ్యాచ్ అనంతరం డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ... 'వికెట్ చాలా నెమ్మదిగా ఉంది. మాకు మరో పూర్తిస్థాయి బ్యాట్స్‌మెన్ అవసరం ఉంది. మైదానం పెద్దది కాబట్టి.. బౌండరీ బాదడం అంత సులువుకాదు. బౌలింగ్ విభాగంలో మా జట్టు ప్రదర్శన బాగున్నప్పటికీ.. బ్యాటింగ్‌లో వైఫల్యాల కారణంగా ఓటమి పాలవుతున్నాం. మిడిల్ ఆర్డర్ సమస్యలను పరిష్కరించుకోవాలి. జట్టు లోపాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది' అని అన్నాడు.
'ఈ పిచ్‌పై 160 పరుగుల వరకూ ఛేదించవచ్చని అనుకున్నా. అంతకంటే ఎక్కువ పరుగులను రాబట్టడం కష్టమైంది. జట్టులో ఏడుగురు బౌలర్లు ఉంటే.. ఎప్పుడూ మేలు చేస్తుంది. చెన్నై జట్టులో చాలా మంది బౌలర్లు ఉన్నారు. బౌలర్లు రెండు వైపులా స్వింగ్ చేస్తున్నప్పుడు పవర్‌ప్లేలో పరుగులు చేయటం కష్టం. అలాంటప్పుడే బౌలర్లపై విడుచుకుపడాలి. కానీ అది సాధ్యం కాలేదు. వచ్చే మ్యాచులలో వికెట్లను కాపాడుకోవాలి. మంచి జట్టును ఎన్నుకోవాలి. లీగ్ ఇప్పుడు రసవత్తరంగా మారింది.రాబోయే రోజులు మాకు చాలా కీలకం. టాప్ జట్లను ఓడించి పాయింట్లు మెరుగుపరుచుకోవాలి' అని డేవిడ్ వార్నర్ చెప్పాడు.
ఈ మ్యాచులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సామ్ కరన్ (31; 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షేన్ వాట్సన్ (42; 38 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), అంబటి రాయుడు (41; 34 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లు)లు రాణించారు. ఆపై ఛేదనలో హైదరాబాద్ 147 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. కేన్ విలియమ్సన్ (57; 39 బంతుల్లో 7×4) పోరాడినా ఫలితం లేపోయింది.