'రాహుల్ అద్భుతమైన వ్యక్తి.. అతని కెప్టెన్సీలో ఆడటానికి ఎదురుచూస్తున్నా'

ట్రినిడాడ్: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ ఒక అద్భుతమైన వ్యక్తి అని వెస్టిండీస్ పేసర్ షెల్డన్ కాట్రెల్ అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున రాహుల్ నాయకత్వంలో ఆడటం కోసం ఎదురుచూస్తున్నా అని తెలిపాడు. 2019 డిసెంబర్‌లో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. కాట్రెల్‌ను రూ.8.5 కోట్లకు కొనుగోలు చేసింది. కాట్రెల్ ఐపీఎల్‌లో ఆడటం ఇదే మొదటిసారి. ఐపీఎల్ 2020 మ్యాచులు సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు జరుగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా షార్జా, అబుదాబి మరియు దుబాయ్ వేదికల్లో అన్ని మ్యాచులు జరగనున్నాయి.

పంజాబ్ ఫ్యామిలీతో కలవాలని:
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షెల్డన్ కాట్రెల్ పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. కేఎల్ రాహుల్ నాయకత్వంలో ఆడటం, మొహమ్మద్ షమీతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం, ఐపీఎల్‌లో ఆరంగేట్రం చేయడం గురించి మాట్లాడాడు. 'ఐపీఎల్‌లో ఆడటం గురించి నేను చాలా సంతోషిస్తున్నా. ఎప్పుడెప్పుడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్యామిలీతో కలిసి ఉంటానా అని ఎదురుచూస్తున్నా. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆడటానికి నేను ఇష్టపడతాను. అతను అద్భుతమైన వ్యక్తి. నేను ఇప్పుడు క్రిస్ గేల్, నికోలస్ పూరన్‌తో కలిసి ఆడబోతున్నా' అని కాట్రెల్ అన్నాడు.

రాహుల్ అద్భుతమైన క్రికెటర్:
'భారతదేశం చివరిసారిగా కరేబియన్‌లో పర్యటించినప్పుడు నేను కేఎల్ రాహుల్‌తో చాలా సమయం మాట్లాడాను. అతను ఒక అద్భుతమైన క్రికెటర్. ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నాడు. అతడు నాకంటే చాలా ఎక్కువ సిరీస్‌లు ఆడాడు కాబట్టి చాలా అనుభవం ఉంది' అని షెల్డన్ కాట్రెల్ అన్నాడు. ఈ కరీబియన్ పేసర్ ఇప్పటివరకు 49 వికెట్లు పడగొట్టాడు. కాట్రెల్ 2019 ప్రపంచకప్‌లో 8.25 సగటుతో 12 వికెట్లు తీశాడు.

షమీ నుంచి మెళకువలు నేర్చుకుంటా:
మహమ్మద్ షమీ గురించి మాట్లాడుతూ... 'షమీ మొదటి నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. నా కంటే సీనియర్ల నుంచి తెలియని విషయాలను నేర్చుకుంటా. నేను ఒక విద్యార్థిని, కాబట్టి షమీ నుంచి బౌలింగ్ మెళకువలను నేర్చుకుంటా' అని షెల్డన్ కాట్రెల్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో కాట్రెల్ ఇప్పటివరకు 2 టెస్టుల్లో, 35 వన్డేల్లో, 27 టీ20 మ్యాచ్‌ల్లో విండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

వికెట్ తీసిన ఆనందంలో సెల్యూట్:
వెస్టిండీస్ పేస్ బౌలర్ షెల్డాన్ కాట్రెల్ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేది అతడి 'సెల్యూట్'. వికెట్ తీసిన ఆనందంలో కాట్రెల్ సెల్యూట్ చేసి సంబరాలు చేసుకుంటాడు. ఈ సెల్యూట్‌తో క్రికెట్ అభిమానులకు కాట్రెల్ మరింత చేరువయ్యాడు. అయితే కాట్రెల్ కేవలం బౌలింగ్ మాత్రమే కాదు బ్యాట్ కూడా జులిపిస్తాడు. గత జనవరిలో ఐర్లాండ్-వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. విండీస్ విజయానికి చివరి ఓవర్లో 5 పరుగులు అవసరం కాగా.. ఐర్లాండ్‌కు ఒక వికెట్ కావాలి. చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సి దశలో కాట్రెల్ కవర్స్ దిశగా భారీ సిక్సర్ బాది జట్టును గెలిపించాడు. సిక్సర్‌తో మ్యాచ్‌ను గెలిపించిన తొలి నం.11గా అరుదైన రికార్డును కాట్రెల్ తన ఖాతాలో వేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications