
నమ్మకంతోనే అవకాశాలు:
ప్రజెంటర్ రుపా రమణితో జరిగిన సంభాషణలో షేన్ వాట్సన్ మాట్లాడుతూ సీఎస్‌కే టీమ్‌తో పాటు కెప్టెన్ ఎంఎస్ ధోనీతో ఉన్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. '2018 నుంచి సీఎస్‌కేతో ఉన్న మూడేళ్ల ప్రయాణం నాకు మరువలేనిది. ఈ మూడేళ్లలో ఎంఎస్ ధోనీతో పాటు కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ నాకు ఎంతో సహకరించారు. ఒక దశలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో విఫలమైన సమయంలో మహీ నాకు అండగా నిలిచాడు. కేవలం నాపై ఉన్న నమ్మకంతోనే అవకాశాలు కల్పించాడు. ఈ మూడేళ్లలో సీఎస్‌కేతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నేను మొదటిసారి సీఎస్‌కే జట్టులో అడుగుపెట్టిన 2018లోనే ఆ జట్టు టైటిల్ కొల్లగొట్టడం.. అదే విధంగా నేను ఆడిన మొదటి ఐపీఎల్ సీజన్‌లో రాజస్తాన్ తరపున మొదటి ఐపీఎల్ టైటిల్ గెలవడం యాదృశ్చికమనే చెప్పాలి' అని వాట్సన్ పేర్కొన్నాడు.

ఇంతలా గౌరవిస్తారా:
'ఒకసారి ఐపీఎల్ సీజన్ సందర్భంగా విమానంలో ప్రయాణం చేస్తుండగా.. ధోనీపై తీసిన డాక్యుమెంటరీ చూసాను. ఆ డాక్యుమెంటరీలో మహీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పటినుంచి కెప్టెన్ అయ్యేవరకు చూశాం. ధోనీ అనే పేరుకు ఇంత అభిమానం ఉందా.. ఒక వ్యక్తిపై భారతీయ ప్రజలు ఇంతలా గౌరవిస్తారా అనేది వీడియో చూసిన తర్వాత అర్థమైంది. బహుశా సచిన్ తర్వాత భారత క్రికెట్‌లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది మహీలోనే. అతను తీసుకునే నిర్ణయాలు కూల్ కెప్టెన్ అనే పేరును సార్థకం చేశాయి. జట్టు ఎలాంటి సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నా.. కేవలం తన ఆలోచనలతోనే ఓటమి నుంచి విజయాల బాట పట్టించాడు' అని మాజీ ఆల్‌రౌండర్ చెప్పాడు.

ధోనీ ఇంపాక్ట్ అప్పుడే తెలిసింది:
'భారత్‌లో క్రికెట్‌కు ఎంతలా అభిమానులుంటారనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ సందర్భంలో ఇలాంటివి నేను చాలా చూశా. ఎంఎస్ ధోనీకి ఉన్న ఫాలోయింగ్‌తో సాధారణంగానే సీఎస్‌కేకు ఎక్కువగా అభిమానులు ఉండేవారు. చెన్నైలో మ్యాచ్‌లు జరిగేటప్పుడు అభిమానం ఎంతలా ఉంటుందో.. మేం బయటి మైదానాల్లో ఆడేటప్పుడు కూడా సీఎస్‌కేకు అంతేమంది ఫ్యాన్స్ ఉంటారు. ఇది కేవలం ధోనీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అని చెప్పొచ్చు' అని షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు.

4 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు:
2008లో ప్రారంభమైన ఐపీఎల్ మొదటి సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన షేన్ వాట్సన్.. తొలి సీజన్‌లోనే 472 పరుగులతో పాటు 17 వికెట్లు తీసి ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత దాదాపు ఏడు సీజన్ల పాటు రాయల్స్‌కు ఆడాడు. ఆర్‌ఆర్ జట్టుపై నిషేధం పడిన తర్వాత 2016లో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన వాట్సన్.. 2018లో చెన్నైకి ఆడాడు. వాట్సన్ తన ఐపీఎల్ కెరీర్‌లో 3874 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆల్‌రౌండర్ అయిన వాట్సన్ 92 ఐపీఎల్ వికెట్లను కూడా పడగొట్టాడు.


Click it and Unblock the Notifications












