
ఐపీఎల్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపుగా అన్ని మ్యాచులు చివరి బంతి వరకు ప్రేక్షకుడిని తన సీటులో కూర్చుండేలా చేశాయి. అంత ఉత్కంఠ భరితంగా సాగాయి. ఇప్పటి వరకు వరస పరాజయాలు మూటకట్టుకున్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ మ్యాచ్ ద్వారా ఈ సీజన్‌లో క్రిస్ గేల్ తన తొలి గేమ్‌ను ఆడాడు. క్రిస్ గేల్‌ను గత మ్యాచులకు ఎందుకు దూరం చేశారంటూ నెటిజెన్లు అతని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇదే ప్రశ్నను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా వేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఆడిన తొలి ఏడు మ్యాచుల్లో క్రిస్ గేల్‌ను దూరం పెట్టడాన్ని సచిన్ టెండూల్కర్ ప్రశ్నించాడు.ఆ సమయంలో ఆడిన ఏడు మ్యాచుల్లో ఆరింటిలో ఓటమి చవిచూసింది పంజాబ్ జట్టు. మంచి ప్రదర్శన ఇచ్చినప్పటికీ కూడా జట్టు మాత్రం విజయతీరాలను అందుకోలేకపోయింది. ఇక వరస పరాజయాలతో పంజాబ్ అట్టడుగుకు వెళ్లడంతో ఫ్రాంఛైజీ క్రిస్ గేల్‌ను రంగంలోకి దింపింది. అంతే ఫలితం పాజిటివ్‌గా వచ్చింది. ఇప్పుడు క్రిస్ గేల్‌ను తొలి ఏడు మ్యాచులకు దూరం చేసి తప్పు చేశామా అని తల పట్టుకుంటోంది.
ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన తర్వాత క్రిస్ గేల్ ఇక ఏ బ్యాట్ పట్టలేదు. దీంతో తొలి మ్యాచ్ ఆడుతున్న అతనిపై కాస్త ఒత్తిడి ఉన్నింది. ఒత్తిడిని అధిగమించి తన సహజశైలిలో బ్యాట్‌కు పనిచెప్పిన క్రిస్ గేల్ 45 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఇందులో ఐదు భారీ సిక్సులు ఉన్నాయి. బ్యాటింగ్ నెమ్మదిగా ప్రారంభించినప్పటికీ... ఆ తర్వాత వేగంను అందిపుచ్చుకున్నాడు ఈ జమైకన్ స్టార్. ఒక్కసారి కుదురుకున్నాక బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు గేల్. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్ గేల్ ఇన్నింగ్స్ పై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు ప్రస్తుతం పంజాబ్ ప్రదర్శన భేషుగ్గా ఉందన్న సచిన్... క్రిస్ గేల్‌ను ముందు మ్యాచుల్లో ఆడించి ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయ పడ్డాడు.
మొత్తానికి చివరి ఓవర్ చివరి బంతి వరకు కొనసాగిన మ్యాచ్‌లో నికోలస్ పూరన్ ఆడిన ఒకే ఒక బంతిని సిక్స్‌గా మలచడంతో పంజాబ్ జట్టు మరో ఓటమి తప్పించుకుని విజయం సాధించింది. అంతేకాదు టోర్నీలో ఇప్పుడు రెండు విజయాలు నమోదు చేసింది.