
అబుదాబి: ఐపీఎల్ 2020లో మరో నామమాత్రపు పోరుకు అబుదాబి మైదానం సిద్దమైంది. హైదరాబాద్ చేతిలో ఓడి ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ మరికొద్ది సేపట్లో పటిష్ట ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ కీరన్ పొలార్డ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచుకు కూడా రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. మరోసారి పొలార్డ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ కోసం ముంబై ఒక మార్పు చేసింది. నాథన్ కౌల్టర్ నీల్ స్థానంలో జేమ్స్ ప్యాటిన్సన్ ఆడుతున్నాడు. మరోవైపు రాజస్థాన్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
ప్లే ఆఫ్ ఆశలు సన్నగిల్లినా గౌరవంగానైనా టోర్నీ నుంచి తప్పుకోవాలని స్మిత్ సేన భావిస్తోంది. మరోవైపు ఆల్‌రౌండ్ షోతో టేబుల్ టాపర్‌గా ఉన్న ముంబై ఈ మ్యాచ్ గెలిచి తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ సీజన్ ఫస్టాఫ్‌లో ముంబై చేతిలో చిత్తుగా ఓడిన రాజస్థాన్.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది.
ఇక తొడకండరాల గాయం కారణంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌కు దూరమైన రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగే అవకాశాలు లేవు. గాయం తీవ్రత, టీమిండియా అప్‌కమింగ్ ఆస్ట్రేలియా టూర్ దృష్ట్యా బీసీసీఐ సూచనల మేరకు అతని గాయాన్ని మరికొన్ని రోజులు పరీక్షించనున్నారు. దాంతో గత మ్యాచ్‌లో ముంబైని నడిపించిన కీరన్ పొలార్డ్ సారథ్యంలో ముంబై బరిలోకి దిగనుంది. అయితే ముంబై జోరు కొనసాగుతుందా? లేక రాజస్థాన్ ప్రతీకారం తీర్చుకుంటుందో చూడాలి.
ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 23 సార్లు తలపడగా 12-11తో ముంబై లీడ్‌లో ఉంది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. తొలి అంచె మ్యాచ్‌లో ముంబై 57 పరుగులతో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. అయితే 2018,19 సీజన్లలో రెండూ మ్యూచ్‌ల్లోనూ రాజస్థానే గెలుపొందింది. మరి ఈసారి ఏ జట్టును విజయం వరిస్తుందో చూడాలి.
అబుదాబి పిచ్ గత కొన్ని మ్యాచ్‌లుగా చేజింగ్‌కు అనుకూలిస్తోంది. ఇక్కడ ఇప్పటి వరకు మొత్తం 15 మ్యాచ్‌లు జరగ్గా.. 7 మ్యాచ్‌లు చేజింగ్ టీమ్సే గెలిచాయి. ఈ మైదానంలో ముంబై ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి 5 గెలిచింది. ఈ మైదానంలో మూడు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ ఒకటే గెలిచింది. ఇందులో ఒకటి ముంబై చేతిలోనే ఓడింది. రెండో అంచె మ్యాచ్‌ల్లో పిచ్‌లన్నీ అనూహ్యంగా బ్యాటింగ్‌కు ప్రతికూలమయ్యాయి. స్వింగ్, స్పిన్‌కు అనుకూలిస్తున్నాయి. ఈ రోజు ఎలా ఉండనుండో మరికొద్ది సేపట్లో తేలనుంది.
తుది జట్లు:
రాజస్థాన్: రాబిన్ ఊతప్ప, జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సంజూ శాంసన్, బెన్ స్టోక్స్, రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, అంకిత్ రాజ్‌పుత్, కార్తీక్ త్యాగి.
ముంబై: క్వింటన్ డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ (కెప్టెన్), కృనాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చహర్, జస్‌ప్రీత్ బుమ్రా.