
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో 12వ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా బుధవారం రాత్రి 7:30 గంటలకు రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్ ) జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు తాము ఆడిన చివరి మ్యాచుల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్నాయి. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రెండు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. దీంతో పోరు రసవత్తరంగా సాగనుంది. అయితే మంచి ఫామ్‌లో ఉన్న యువబ్యాట్స్‌మన్ సంజు శాంసన్, శుభ్‌మన్ గిల్‌పైనే అందరి దృష్టి నెలకొంది.
సంజు శాంసన్, శుభ్‌మన్ గిల్ ఫామ్‌లో ఉన్నా.. ఈ మ్యాచ్‌లో ఇద్దరికీ బౌలర్ల నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నుంచి గిల్‌కు.. కోల్‌కతా పేసర్ ప్యాట్ కమిన్స్ నుంచి శాంసన్‌కు ప్రమాదం పొంచివుంది. ఐపీఎల్ 2020లో శాంసన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఆర్ధ శతకాలు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. చెన్నైతో మ్యాచ్‌లో (74; 32 బంతుల్లో 1 ఫోర్, 9 సిక్సర్లు) వీరవిహారం చేసిన సంజు.. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ (85; 42 బంతుల్లో 4ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగుల వరద పారించాడు. దీంతో రాజస్థాన్ సంజూపై భారీ అంచనాలు పెట్టుకుంది.
ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ ఆస్ట్రేలియన్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్‌ను ఎదుర్కోవాల్సి ఉంది. తొలి మ్యాచ్‌లో ముంబైపై పెద్దగా రాణించని కమిన్స్.. తర్వాత మ్యాచ్‌లో హైదరాబాద్‌పై అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి కేవలం 14 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇప్పటి వరకూ 18 మ్యాచ్‌లాడిన కమిన్స్ 8.44 ఎకానమీతో 18 వికెట్లు తీశాడు. మరి కమిన్స్ రివర్స్‌స్వింగ్ శాంసన్‌పై పనిచేస్తుందో లేదో చూడాలి. ఇక 95 మ్యాచులాడిన సంజు 133 స్ట్రైక్‌రేటుతో 2,368 పరుగులు చేశాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచులో 7 పరుగులే చేసి విఫలమయినా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో (70; 62 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్ చేశాడు. దీంతో 7 వికెట్ల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది. ఇప్పుడు ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను ఎదుర్కోవాలి. ఆర్చర్ ఈ సీజన్‌లో ఒకటే వికెట్ తీసుకున్నప్పటికీ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. అతడి బౌన్సర్లను ఎదుర్కోవడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.