హిట్‌మ్యాన్ హిట్టింగ్:
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత మార్చి నుంచి ఇంటికే పరిమితమైన ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ మళ్లీ బ్యాట్ పట్టాడు. ఐపీఎల్ 2020 సీజన్ కోసం ప్రాంచైజీ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్ చేశాడు. నెట్స్‌లో ఫాస్ట్ బౌలర్లని హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఎదుర్కొంటున్న వీడియోని తాజాగా ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. 'మేము హిట్‌మ్యాన్‌ను చివరిసారిగా చూసి 195 రోజులు అయింది. నిరీక్షణకు తెరపడింది. హిట్‌మ్యాన్ హిట్టింగ్ మొదలెట్టాడు' అని కాప్షన్ రాసుకొచ్చింది.

నటరాజ షాట్స్‌తో:
నెట్స్‌లో రోహిత్ శర్మ ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో తొలుత బంతిని మిడిల్ చేసేందుకు ప్రయత్నించాడు. క్రమంగా జోరు పెంచుతూ బ్యాట్ జులిపించాడు. ప్రాక్టీస్ సెషన్ జరుగుతున్నకొద్దీ.. ఫుల్ షాట్, బ్యాక్ ఫుట్ షాట్, ఫ్రంట్ ఫుట్ షాట్, స్ట్రయిట్ డ్రైవ్, స్లొగ్ స్లీప్,స్విచ్ హిట్, కవర్ డ్రైవ్‌లు ఆడాడు. ముఖ్యంగా తన మార్క్ నటరాజ షాట్స్‌తో సెషన్ ముగించాడు. కెప్టెన్‌గా ముంబైని నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా రోహిత్ నిలిపిన విషయం తెలిసిందే. ఇక లీగ్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ ఢీకొట్టబోతోంది. తొలి పోరే రసవత్తరంగా సాగనుంది.

195 రోజుల తర్వాత:
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గత ఫిబ్రవరిలో చివరి మ్యాచ్ ఆడాడు. న్యూజీలాండ్ పర్యటనలో భాగంగా ఐదవ టీ20 ఆడుతుండగా.. అతనికి కాలిపిక్క గాయం అయింది. దీంతో ఆ తర్వాత జరిగిన వన్డే, టెస్ట్ సిరీస్‌లలో ఆడలేదు. అనంతరం మార్చిలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. కోలుకున్న రోహిత్ ఐపీఎల్ 2020లో ఆడాలని చూశాడు. అయితే కరోనా కారణంగా మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్.. సెప్టెంబరు 19కి వాయిదా పడింది. వైరస్ నేపథ్యంలో శ్రీలంక, జింబాంబ్వే, ఇంగ్లండ్ పర్యటనలను బీసీసీఐ రద్దు చేయడంతో ఫిబ్రవరి నుండే రోహిత్ బ్యాట్ పట్టలేదు. 195 రోజుల తర్వాత ఐపీఎల్ కోసం మళ్లీ హిట్టింగ్ మొదలెట్టాడు.

నెగటివ్ వచ్చిన వారికే ప్రాక్టీస్:
ఆటగాళ్లు, సహాయ సిబ్బందిని ముంబై ఇండియన్స్ ప్రాంచైజీ ముంబైకి రప్పించి క్వారంటైన్‌లో ఉంచి రెండు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించింది. ఈ రెండింటిలోనూ నెగటివ్ వచ్చిన వారికి ప్రాక్టీస్ ఏర్పాటు చేసింది. ఇక యూఏఈకి బయల్దేరే ముందు 8 జట్ల యాజమాన్యం, ఆటగాళ్లు, సహాయ సిబ్బందిని వారం రోజులు క్వారంటైన్‌లో ఉంచి రెండు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రెండింటిలోనూ నెగటివ్ వచ్చిన వారు మాత్రమే యూఏఈకి బయల్దేరి వెళ్లనున్నారు. యూఏఈకి వెళ్లిన వెంటనే అక్కడ ఒకసారి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆపై 14 రోజులు క్వారంటైన్‌లో క్రికెటర్లని ఉంచనున్నారు. తొలి వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు పరీక్షలు చేయించుకొని అన్నీ నెగెటివ్‌గా తేలాలి. అప్పుడే బయో బబుల్‌లోకి చేర్చి ప్రాక్టీస్‌కు అవకాశం ఇస్తారు.


Click it and Unblock the Notifications
