
అబుదాబి: క్రికెట్ అభిమానులకు ఈ రోజు డబుల్ ధమాకా. ఇన్ని రోజులు ఒక్క మ్యాచ్ ఆస్వాదించిన ఫాన్స్.. ఇకపై శని, ఆదివారాల్లో రెండు మ్యాచ్‌లు చూడనున్నారు. ఈ రోజు జరిగే తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు మరికొద్ది సేపట్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అంకిత్ రాజ్‌పూత్ స్థానంలో కొత్త కుర్రాడు మహిపాల్ లోమ్‌రోర్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలాంటి మార్పులు చేయలేదు.
ముంబైపై వచ్చిన గెలుపుతో బెంగళూరు ఉత్సాహంగా కనిపిస్తోంది. రాజస్థాన్‌పై గెలిచి అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు రాజస్థాన్ రెండు విజయాల జోరుకు బ్రేక్ పడింది. దీంతో బెంగళూరుపై విజయం సాధించి మళ్లీ విజయాల బాట పట్టాలని రాజస్థాన్ భావిస్తోంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. బెంగళూరు జట్టుపై రాజస్థాన్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్‌కు మంచి రికార్డు ఉంది. తాను విసిరిన 40బంతుల్లో నాలుగుసార్లు డివిలియర్స్‌ను, మూడుసార్లు కోహ్లీని పెవిలియన్‌కు పంపించాడు. మరోవైపు చహల్ కూడా కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి సంజు శాంసన్‌ను మూడు సార్లు అవుట్ చేశాడు.
ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 20 సందర్భాల్లో తలపడ్డాయి. అందులో 10 విజయాలతో రాజస్థాన్‌దే పైచేయి. మరో 8 మ్యాచుల్లో బెంగళూరు విజయం సాధించింది. రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అబుదాబి పిచ్ బ్యాట్స్‌మన్‌కు అనుకూలం. గత రెండు మ్యాచులో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ రోజు కూడా పరుగుల వరద పారే అవకాశం ఉంది.
జట్లు:
బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, ఏబీ డివిలియర్స్, శివమ్ దూబె, గుర్కీరత్ మన్‌సింగ్, ఇసురు ఉడాన, వాషింగ్టన్ సుందర్, ఆడమ్ జంపా, నవదీప్ సైనీ, యుజ్వేంద్ర చహల్.
రాజస్థాన్: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోస్ బట్లర్, సంజు శాంసన్, రాబిన్ ఉతప్ప, రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్, టామ్ కరన్, జొఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, మహిపాల్ లోమ్‌రోర్, అంకిత్ రాజ్‌పుత్, జయదేవ్ ఉనద్కత్.