
షార్జా: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరాడే స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 రన్స్ చేసి.. పంజాబ్ ముందు 172 పరుగుల లక్షాన్ని ఉంచింది. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ (48; 39 బంతుల్లో 3 ఫోర్లు) హాఫ్ సెంచరీ ముందు ఔట్ అయ్యాడు. ఇన్నింగ్స్ చివరలో క్రిస్ మోరిస్ (25 నాటౌట్; 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టు స్కోరును 170 దాటించాడు. అరోన్ ఫించ్ (20), శివమ్ దూబే (23) ఫర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లు మొహమ్మద్ షమీ, మురుగన్ అశ్విన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు దేవదత్ పడిక్కల్ (20: 18 బంతుల్లో 2x4, 1x6), అరోన్ ఫించ్ (18: 12 బంతుల్లో 1x4, 1x6) మంచి ఆరంభాన్ని అందించారు. ఈ జోడి తొలి వికెట్‌కి 4 ఓవర్లలోనే 38 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జోరుమీదున్న వీరి భాగస్వామ్యాన్ని అర్షదీప్ సింగ్ విడదీశాడు. అర్షదీప్ వేసిన ఐదో ఓవర్ మొదటి బంతికే పడిక్కల్.. నికోలస్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు ఫోర్లు బాది 11 పరుగులు సాధించాడు. పవర్‌ప్లేలో బెంగళూరు వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది.
మురుగన్ అశ్విన్ వేసిన ఏడో ఓవర్లో ప్రమాదకర ఆరోన్ ఫించ్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం విరాట్ కోహ్లీ నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ఇక డివిలియర్స్ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన వాషింగ్టన్ సుందర్ (13: 14 బంతుల్లో 1x4) నిరాశపరచగా.. శివమ్ దూబే (23: 19 బంతుల్లో 2x6) రెండు భారీ షాట్లతో సరిపెట్టాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు కారణంగా ఆరో స్థానంలో క్రీజులోకి వచ్చిన మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ (2) పూర్తిగా నిరాశపరిచాడు. బంతి వ్యవధిలోనే కోహ్లీ కూడా వికెట్ చేజార్చుకున్నాడు. దాంతో బెంగళూరు 17.5 ఓవర్లు ముగిసే సమయానికి 136/6తో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది.
ఇన్నింగ్స్ చివరి రెండు ఓవర్లలో క్రిస్ మోరీస్, ఇసుర ఉదాన (10 నాటౌట్: 5 బంతుల్లో 1x6) రెచ్చిపోయారు. 19వ ఓవర్ వేసిన క్రిస్ జోర్దాన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన మోరీస్.. 10 పరుగులు రాబట్టాడు. చివరి ఓవర్ వేసిన మొహమ్మద్ షమీ బౌలింగ్‌లో మోరీస్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టేశాడు. ఇదే ఓవర్‌లో ఇసుర ఉదాన కూడా ఓ సిక్స్ బాదడంతో మొత్తం 24 పరుగులు వచ్చాయి. దాంతో బెంగళూరు 171 పరుగులు చేసింది. షమీ, అశ్విన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.