RCB vs KKR: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పాయింట్ల పట్టికలో కోహ్లీసేన జోరు!!

దుబాయ్: మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడిన వేళ.. రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌కే పరిమితమై సహచరుడికి పూర్తి సహకారం అందించిన చోట.. బౌలర్లు సమిష్టిగా కదం తొక్కడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) సోమవారం మరో సూపర్ విక్టరీ నమోదు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఏకంగా 82 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో బెంగళూరు వరుస విజయాలతో ప్లేఆఫ్ రేసులో ముందజ వేసింది.

ఎన్నాళ్లకెన్నాళ్లకు:
ఐపీఎల్ 2020లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడిన బెంగళూరు ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. చివరిగా ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఏకంగా నాలుగు గెలవడం గమనార్హం. దాంతో పాయింట్ల పట్టికలోనూ కోహ్లీసేన నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. పాయింట్ల పట్టికలో చాన్నాళ్ల తర్వాత బెంగళూరు తమ జోరు కొనసాగిస్తోంది. దాదాపు గత మూడు సంత్సరాలలో ఇంత దూకుడుగా బెంగళూరు ఆడలేదు. పాయింట్ల పట్టికలోనూ ఎన్నడూ ఎలాంటి జోష్ చూపించలేదు. దీంతో బెంగళూరు ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కనీసం మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా:
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2016 సీజన్‌లో ప్లేఆఫ్‌కి దూసుకెళ్లింది. కానీ టైటిల్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి చేజార్చుకుంది. ఆ తర్వాత వరుసగా 2017, 2018, 2019 సీజన్‌లో కనీసం ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. పాయింట్ల పట్టికలోనూ చిట్టచివరి స్థానంతో సరిపెట్టుకుంది. దాంతో ఈ ఏడాది కోహ్లీ సేనపై అంచనాలు లేవు. అయితే ఈ ఏడాది అనూహ్య విజయాల్ని అందుకుంటూ పాయింట్ల పట్టికలో దూసుకెళ్తోంది. ఐపీఎల్ 2020 లీగ్ దశలో బెంగళూరు మరో 7 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో కనీసం మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా.. ప్లేఆఫ్‌కి అర్హత సాధించే అవకాశం ఉంది.

డివిలియర్స్ వీరవిహారం:
మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 194 పరుగులు చేసింది. మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ (33 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) వీర విహారం చేస్తే.. ఫించ్ (47; 4 ఫోర్లు, ఒక సిక్సర్), కోహ్లీ (33 నాటౌట్; ఒక ఫోర్) ఫర్వాలేదనిపించారు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 112 పరుగులకే పరిమితమైంది. శుభ్‌మన్ గిల్ (25 బంతుల్లో 34; 3 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్. బెంగళూరు బౌలర్లలో మోరిస్, సుందర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications