
హైదరాబాద్: సోమవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 82 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఈ మ్యాచులో ఏబీ డివిలియర్స్ కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడిన వేళ.. రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌కే పరిమితమై సహచరుడికి పూర్తి సహకారం అందించాడు. ఓ ఎండ్‌లో ఏబీ ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడుతుంటే.. మరో ఎండ్‌లో కోహ్లీ సింగిల్స్ తీస్తూ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో రన్‌మెషీన్ కోహ్లీపై జోకులు పేలుతున్నాయి.
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరుపై ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ అలెగ్జెండ్రా హార్ట్‌లీ సరదాగా స్పందించారు. ఏబీ డివిలియర్స్ బ్యాట్‌ను విరాట్ కోహ్లీ కళ్లప్పగించి చూస్తున్నాడనే అర్ధం వచ్చే ఎమోజీలను పోస్ట్ చేశారు. నవ్వుతున్న,ఆశ్చర్యపోతున్న ఎమోజీలను హార్ట్‌లీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై మరో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ కేట్ క్రాస్ స్పందించి.. నువ్ కూడా నా బ్యాటింగ్‌ను అలానే చూస్తావు అని సెటైర్ వేశారు. అలెగ్జెండ్రా హార్ట్‌లీ.. విరాట్ కోహ్లీకి పెద్ద ఫ్యాన్ అన్న విషయం తెలిసిందే. అయితే హార్ట్‌లీ ట్వీట్‌పై కోహ్లీ అభిమానులు కొందరు మండిపడుతున్నారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కింది. దేవదత్ పడిక్కల్ (32; 4 ఫోర్లు, ఒక సిక్సర్)తో కలిసి ఆరోన్ ఫించ్ ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. ఈ జోడీ వరుస బౌండ్రీలతో బెంబేలెత్తించడంతో పవర్ ప్లే ముగిసేసరికి బెంగళూరు 47/0తో నిలిచింది. తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించాక పడిక్కల్ ఔట్ కావడంతో ఒక్కసారిగా ఇన్నింగ్స్ గాడి తప్పింది. బంతి కూడా కాస్త ఆగి వస్తుండటంతో.. వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. ఒక దశలో బెంగళూరు 29 బంతుల వ్యవధిలో కనీసం ఒక్క బౌండ్రీ కూడా కొట్టలేకపోయింది. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోర్ 111/2గా ఉంది. కోహ్లీ, డివిలియర్స్ క్రీజులో ఉన్నా.. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేస్తుండటంతో పరుగులు రాలేదు.
అయితే కమలేష్ నాగర్‌కోటి వేసిన 16వ ఓవర్‌లో ఏబీ డివిలియర్స్ దంచుడు మొదలెట్టాడు. 6, 6, 4తో 18 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ వేసిన 17వ ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి. ఆండ్రీ రస్సెల్ వేసిన మరుసటి ఓవర్‌లో 4, 6 బాదిన డివిలియర్స్ 23 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. డివిలియర్స్ దూకుడు మీదుండటంతో.. మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీ సింగిల్స్ తీస్తూ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. ఏబీ బ్యాట్ జుళిపిస్తుంటే.. కోహ్లీ అలా చూస్తుండిపోయాడు. ఈ జంట అభేద్యమైన మూడో వికెట్‌కు 46 బంతుల్లోనే 100 పరుగులు జోడించారు. ఏబీ ధాటికి బెంగళూరు చివరి ఐదు ఓవర్లలో 83 పరుగులు చేసింది. 15 ఓవర్లు ముగిసిన సమయంలో 21 బంతుల్లో 20 పరుగులతో ఉన్న కోహ్లీ మ్యాచ్ ముగిసేసరికి మరో 13 పరుగులు మాత్రమే జోడిస్తే.. డివిలియర్స్ ఏకంగా 65 రన్స్ రాబట్టాడు.