
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో టీమిండియా రన్ మెషిన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు బ్రేక్ చేశాడు. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో టాస్ వేయడంతోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో ఒకే జట్టుకు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. బెంగళూరు తరఫున విరాట్ 197వ మ్యాచ్‌కు హాజరయ్యాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోసం విరాట్ కోహ్లీ 197వ మ్యాచ్‌కు హాజరయి.. ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ హిల్డ్రెత్‌ను అధిగమించాడు. ఇంగ్లీష్ కౌంటీ జట్టు సోమర్‌సెట్ తరఫున జేమ్స్ హిల్డ్రెత్ 196 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ రోజు మ్యాచ్ ద్వారా హిల్డ్రెత్‌ను విరాట్ అధిగమించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. హిల్డెత్ తర్వాత ఎంఎస్ ధోనీ, సమిత్ పటేల్ మూడో స్థానంలో ఉన్నారు. ఇద్దరూ వరుసగా చెన్నై సూపర్ కింగ్స్, నాటింగ్హామ్ షైర్ జట్లకు189 మ్యాచులు ఆడారు.
విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత ముంగిట నిలిచాడు. బెంగళూరు కెప్టెన్ మరో 10 రన్స్ చేస్తే టీ20ల్లో 9వేల పరుగుల మైలురాయిని అందుకోనున్నాడు. తద్వార టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా విరాట్ చరిత్ర సృష్టించనున్నాడు. ఓవరాల్‌గా టీ20ల్లో ఈ ఫీట్ సాధించిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా నిలవనున్నాడు. టీ20ల్లో 9వేల పరుగుల మైలురాయి అందుకున్న జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్(13296) టాప్‌లో ఉండగా.. కీరన్ పొలార్డ్(10370), షోయబ్ మాలిక్ (9926), బ్రెండన్ మెకకల్లమ్(9922), డేవిడ్ వార్నర్(9451), ఆరోన్ ఫించ్(9148) కోహ్లీ కన్నా ముందున్నారు.
శనివారం ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన బెంగళూరు 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుచేసింది. స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఎప్పటిలాగే మాయ చేయడం.. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ ఫామ్ కొనసాగించడం.. కెప్టెన్ విరాట్ కోహ్లీ లయ అందుకోవడంతో సునాయాస విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ 2020లో ఇప్పటివరకు విఫలమయిన విరాట్ కోహ్లీ.. హాఫ్ సెంచరీ చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. 41 బంతుల్లో అర్ధశతకాన్నందుకున్నాడు. మరి ఈరోజు ఎలా ఆడతాడో చూడాలి. ఇప్పటివరకు నాలుగు ఆడిన ఆర్‌సీబీ మూడు విజయాలు సాధించింది.