
దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా రెండు బలమైన జట్లు అమీతుమీకి సిద్దమయ్యాయి. దుబాయ్ వేదికగా మరికొద్ది సేపట్లో జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండు మార్పులతో కోహ్లీ సేన బరిలోకి దిగుతోంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు ఢిల్లీ ఒక మార్పు చేసింది. అమిత్ మిశ్రా స్థానంలో అక్షర్ పటేల్ వచ్చాడు.
ఈ సీజన్‌లో ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లాడిన ఇరు జట్ల తలా మూడు విజయాలతో టేబుల్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ ఢిల్లీని ముందుండి నడిపిస్తే.. రాజస్థాన్‌తో జరిగిన పోరులో విరాట్ అదే పనిచేశాడు. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో అభిమానులకు మజా లభించనుంది. బలబలాల పరంగా పేపర్‌పై ఇరు జట్లు సమతూకంగా ఉన్నప్పటికీ.. బౌలింగ్ దృష్ట్యా ఢిల్లీ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.
ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 23 సార్లు తలపడగా.. 14-8తో బెంగళూరు లీడ్‌లో ఉంది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని విరాట్ సేన భావిస్తుండగా.. జైత్రయాత్రను కొనసాగించాలని ఢిల్లీ ఉవ్విళ్లూరుతుంది. మరీ గెలుపు ఏ జట్టును వరిస్తుందో చూడాలి. ఇప్పటి వరకు ఈ మైదానంలో జరిగిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. బ్యాటింగ్‌కు ఫేవర్‌గా మారింది. రెండు మ్యాచ్‌లు టై అయి సూపర్ ఓవర్‌కు కూడా దారితీసాయి.
తుది జట్లు:
బెంగళూరు: దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్ (కీపర్), మొయిన్ అలీ, శివం దూబే, ఇసురు ఉడానా, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ, యుజ్వేంద్ర చాహల్.
ఢిల్లీ: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రిషభ్ పంత్, షిమ్రాన్ హెట్‌మైర్, మార్కస్ స్టోయినిస్, హర్షల్ పటేల్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్.