
దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా దుబాయ్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేసింది. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 196 రన్స్ చేసి.. బెంగళూరుకు 197 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్ పృథ్వీ షా (42; 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. 23 బంతుల్లోనే 42 రన్స్ చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మధ్యలో ఢిల్లీ బ్యాట్స్‌మన్ తడబడ్డా.. చివరలో ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ ( 53 నాటౌట్; 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడంతో ఢిల్లీ 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. బెంగళూరు బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందుగా ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో ఢిల్లీ ఇన్నింగ్స్‌ను పృథ్వీ షా, శిఖర్ ధావన్‌లు ధాటిగా ఆరంభించారు. పృథ్వీ షా ఆది నుంచి బౌండరీలే లక్ష్యంగా ఆడితే, ధావన్ మాత్రం స్టైక్ రొటేట్ చేస్తూ ఆడాడు. ఇసురు ఉడానా వేసిన తొలి ఓవర్లోనే పృథ్వీ మూడు బౌండరీలు బాది 14 రన్స్ రాబట్టాడు. నవదీప్ సైనీ వేసిన మూడో ఓవర్‌లో ధావన్ ఒక ఫోర్, షా సిక్సర్ బాదడంతో మరో 14 రన్స్ వచ్చాయి. పవర్‌ప్లేలో ఈ జోడి ఢిల్లీ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించింది. పవర్‌ప్లేలో ఢిల్లీ 63 పరుగులు సాధించింది.
అర్ధ శతకం దిశగా సాగుతున్న పృథ్వీ షాను 10వ ఓవర్లో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ పెవిలియన్ పంపాడు. దీంతో తొలి వికెట్‌కు 68 పరుగులు భాగస్వామ్యంకు తెరపడింది. నిలకడగా ఆడుతున్న శిఖర్ ధావన్.. పేసర్ ఉడానా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో తడబడిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా స్వల్ప వ్యవధిలోనే మొయిన్ అలీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అనంతరం రిషభ్ పంత్‌కు జత కలిసిన స్టోయినిస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
స్టోయినిస్ క్రీజ్‌లోకి వచ్చీ రావడంతోనే బౌండరీల మోత మోగించాడు. మొయిన్ అలీ, నవదీప్ సైనీలపై విరుచుకుపడ్డాడు. స్టోయినిస్, పంత్ ధనాధన్ బ్యాటింగ్‌తో 80కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సమయంలో రిషబ్ పంత్ (37; 25 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్) ధాటిగా ఆడి పెవిలియన్ చేరాడు. అయితే స్టోయినిస్ మాత్రం భారీ షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. చివరి ఓవర్‌లో ఉడానా 12 పరుగులు ఇవ్వడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ రెండు వికెట్లు సాధించగా.. మొయిన్ అలీ, ఉదానాకు తలో వికెట్ దక్కింది.