
దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 రన్స్ చేసి.. చెన్నై ముందు 146 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ (50: 43 బంతుల్లో 1ఫోర్, 1సిక్స్) టాప్ స్కోరర్. కోహ్లీ అర్ధ శతకానికి తోడు ఏబీ డివిలియర్స్ (39: 36 బంతుల్లో 4ఫోర్లు) రాణించడంతో బెంగళూరు గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది. శామ్ కరన్ (3/19), దీపక్ చహర్ (2/31) కట్టుదిట్టంగా బంతులేసి బెంగళూరు భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు.
టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన దేవదత్ పడిక్కల్ (22: 21 బంతుల్లో 2x4, 1x6), అరోన్ ఫించ్ (15: 11 బంతుల్లో 3x4) దూకుడుగా ఆడారు. అయితే ఆర్సీబీ స్కోరు 31 పరుగుల వద్ద ఉండగా ఫించ్ తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. కాసేపటికి పడిక్కల్ రెండో వికెట్‌గా చేరడంతో ఆర్సీబీ 46 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో విరాట్ కోహ్లీ-ఏబీ డివిలియర్స్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.
బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ కోహ్లీ-ఏబీ ఇద్దరూ 82 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డివిలియర్స్ బౌండరీలు లక్ష్యంగా చెలరేగగా.. విరాట్ సింగిల్స్, డబుల్స్ తీసేందుకు ప్రయత్నించాడు. దీపక్ చహర్ వేసిన 18 ఓవర్ మూడో బంతికి డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి ఏబీ ఔటయ్యాడు. అటు తర్వాత మొయిన్ అలీ(1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. సామ్ కరాన్ బౌలింగ్‌లో సాంత్నార్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
విరాట్ కోహ్లీ మరోసారి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 43 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్‌తో 50 పరుగులు చేశాడు. స్కోరును పెంచే క్రమంలో 19 ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. ఆ ఓవర్ సామ్ కరాన్ వేయగా డుప్లెసిస్ క్యాచ్ తీసుకున్నాడు. దాంతో కోహ్లీ ఇన్నింగ్స్ యాభై పరుగుల వద్ద ముగిసింది. అయితే ఇన్నింగ్స్ చివరలో చెన్నై బౌలర్లు పుంజుకున్నారు. దీంతో చివర్లో మెరుపులు లేకుండానే బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. ఆఖరి మూడు ఓవర్లలో బెంగళూరు 4 వికెట్లు కోల్పోయి 20 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు సాధించగా.. దీపక్ చహర్ రెండు వికెట్లు సాధించాడు. సాంత్నార్‌కు వికెట్ దక్కింది.